Telugu Global
Telangana

పోటీ కాంగ్రెస్ తోనే.. బీజేపీని తీసిపారేసిన కేసీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ విజయాలను ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తొమ్మిదేళ్ల పాలనతోనే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్-1 గా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉంది.

పోటీ కాంగ్రెస్ తోనే.. బీజేపీని తీసిపారేసిన కేసీఆర్
X

ధరణిని వద్దన్న కాంగ్రెస్ ని బంగళాఖాతంలో కలిపేద్దాం..

కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ దళారీలదే భోజ్యం..

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది..

ఇటీవల బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవాలతోపాటు, వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. ప్రతిపక్షాలపై విరుచుకుపడే క్రమంలో ఆయన కేవలం కాంగ్రెస్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. బీజేపీని లెక్కలోకి కూడా తీసుకోలేదు. తెలంగాణలో పోటీ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యేనంటూ ఇటీవల కాలంలో నేతలు పదే పదే చెబుతున్నారు, మరోసారి సీఎం కేసీఆర్ కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. కాంగ్రెస్ పోటీయే కానీ ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అని కూడా తేల్చేశారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ మోసానికి బలికావద్దని మాత్రం ప్రజలకు సూచిస్తున్నారు సీఎం కేసీఆర్.

కర్నాటక ఫలితాలతో దక్షిణాదిన బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ అర్థమైంది. అదే సమయంలో కాంగ్రెస్ బలపడుతుందనే విషయం కూడా రుజువైంది. అదే ఊపులో తెలంగాణలో కూడా జెండా ఎగరేస్తామంటూ హస్తం పార్టీ నేతలు చెబుతున్నా.. అక్కడికి ఇక్కడికి పరిస్థితిలో చాలా తేడా ఉంది. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా బీజేపీ పాలనపై ఉన్న వ్యతిరేకత కర్నాటకలో ప్రతిఫలించింది. తెలంగాణలో బీఆర్ఎస్ విజయాలను ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తొమ్మిదేళ్ల పాలనతోనే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్-1 గా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉంది. అందుకే కేసీఆర్ హ్యాట్రిక్ కి సిద్ధంగా ఉన్నారు.

ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే..

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకీ తీసికట్టుగా మారుతోంది. మునుగోడు ఫలితాల తర్వాత బీజేపీ నాయకత్వంలో అంతర్గత పోరు మొదలైంది. మోదీ నాయకత్వంపై దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత తెలంగాణలో కూడా ప్రతిబింబించే అవకాశముంది. అందుకే సీఎం కేసీఆర్ బీజేపీని లెక్కలోనుంచి తీసేశారు. తమ ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేనని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. బీజేపీని మానసికంగా కూడా దెబ్బకొట్టేశారు.

First Published:  7 Jun 2023 7:47 AM IST
Next Story