సర్వేలన్నీ మనకే అనుకూలం -కేసీఆర్
ఎమ్మెల్యేలు.. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు, సభలు నిర్వహించి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు సీఎం కేసీఆర్. సర్వేలన్నీ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని, షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న సందర్భంలో.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత చొరవ చూపాలన్నారు. త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఆ రోజు ప్లీనరీ సమావేశం రద్దు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఆవిర్భావం రోజున ప్లీనరీ నిర్వహించేవారు, ఇకపై బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన రోజునే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రజల్లోకి వెళ్లాలి..
ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు కేసీఆర్. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉందని, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని ఆదేశించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని, ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కీలక నేతలకు సూచించారు.
సంక్షేమ పథకాల గురించి వివరించాలి..
ఎమ్మెల్యేలు.. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు, సభలు నిర్వహించి ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు సీఎం కేసీఆర్. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్, షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు.. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.