సీఎం పర్యటనపై ఇన్ని వివరణలు అవసరమా..?
గతంలో ఎవరూ ఇంత ఇదిగా ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నం చేయలేదు. అసలు ప్రజలు నమ్మడంలేదనే అనుమానం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశ పర్యటన ఎక్కడలేని ఉత్కంఠకు కారణం అవుతోంది. విదేశాల్లో వివిధ కంపెనీలతో సీఎం బృందం కుదుర్చుకున్న ఒప్పందాలపై ఓవైపు దుమారం రేగుతోంది. మరోవైపు సీఎం తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చేస్తున్నారనే పుకార్లు కూడా మొదలయ్యాయి. దీంతో సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది.
గతంలో ఏ ముఖ్యమంత్రి, లేదా మంత్రి విదేశాలకు వెళ్లినా ఇలాంటి వివరణ ఇవ్వడం చాలా అరుదు. సీఎం పర్యటన గురించి ముందుగా ఓ ప్రకటన విడుదల చేస్తారు, మార్పులుంటే అవసరం అనుకుంటే సవరణలు ఇస్తారు. అంతేకానీ మధ్యలో మార్పులేదు అంటూ ప్రత్యేకంగా ప్రకటనలు ఇవ్వడం ఇక్కడ విశేషం. అంతే కాదు.. విదేశాల్లో జరుగుతున్న ఒప్పందాలు కూడా నిఖార్సైనవేనంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ఓ వీడియో విడుదల చేశారు. ఒప్పందాల విషయంలో అన్నీ పక్కాగా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో ఎవరూ ఇంత ఇదిగా ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నం చేయలేదు. అసలు ప్రజలు నమ్మడంలేదనే అనుమానం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదు.
స్వచ్ఛ బయో అనే కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో అసలు కథ మొదలైంది. ఈ కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి చెందినదని, ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ ప్రభుత్వం అలర్ట్ అయింది. అలాంటిదేమీ లేదని వివరణ ఇస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లిన వేళ, తెలంగాణలో రాజకీయ అనిశ్చితి నెలకొందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన హడావిడిగా తన పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగొస్తున్నారని కొన్ని కథనాలు వెలువడ్డాయి. వాటిని ఖండిస్తూ సీఎంఓ ప్రకటన విడుదల చేయడం విశేషం.