తెలంగాణలో నేటినుంచి సీఎం కప్..
ఈరోజు (మే-15)తో మొదలయ్యే సీఎం కప్ సంబురాలను.. ఈనెల 31 వరకు నిర్వహిస్తారు. అన్ని మండల కేంద్రాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్ బాల్ విభాగాల్లో పోటీలు పెడతారు.
తెలంగాణలో నేటినుంచి సీఎం కప్ -2023 మొదలవుతోంది. తెలంగాణ క్రీడా సంబురాలు పేరుతో ఈ పోటీలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆటలపై ఆసక్తి ఉండి, ప్రతిభ ఉండి వెలుగులోకి రాలేకపోయిన క్రీడాకారుల కోసం సీఎం కప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. టాలెంట్ ఉన్నా గ్రామాలకే పరిమితమైన వారిని వెలుగులోకి తెచ్చేందుకే ఈ ప్రయత్నం అని చెప్పారు.
చదువుకొంటూ ఆటల్లో పాల్గొనేవారే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్నారు. చదువు ఆపేసినవారికి సరైన ప్లాట్ ఫామ్ దొరకదు. ఆటల్లో ఆసక్తి ఉన్నా కూడా వారికోసం ప్రత్యేకంగా పోటీలు నిర్వహించడం అరుదు. సీఎంకప్ ద్వారా ఇలాంటి వారిని వెలుగులోకి తెస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకే తెలంగాణ క్రీడా సంబురాలు నిర్వహిస్తున్నారు. చదువుతో సంబంధం లేకుండా 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.
ఈరోజు (మే-15)తో మొదలయ్యే సీఎం కప్ సంబురాలను.. ఈనెల 31 వరకు నిర్వహిస్తారు. అన్ని మండల కేంద్రాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్ బాల్ విభాగాల్లో పోటీలు పెడతారు. మండల స్థాయిలో పోటీలను ఈరోజు నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచినవారిని ఎంపిక చేసి జిల్లా స్థాయిలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచినవారిని జట్టుగా చేసి రాష్ట్రస్థాయిలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లో సీఎం కప్ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.