Telugu Global
Telangana

సీఎం కరుణించినా.. ఆఫీసర్‌ ఆర్డర్‌ ఇవ్వట్లే!

మున్సిపల్ శాఖలో నెలన్నరగా పెండింగ్‌లోనే ప్రమోషన్లు

సీఎం కరుణించినా.. ఆఫీసర్‌ ఆర్డర్‌ ఇవ్వట్లే!
X

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్న చందంగా మారింది మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగుల పరిస్థితి. డిపార్ట్‌మెంట్‌ లో ఉద్యోగుల ప్రమోషన్‌ ఫైల్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డి నెలన్నర క్రితమే ఓకే చేశారు. పదోన్నతులకు సంబంధించిన జీవో కూడా ఇచ్చారు. కానీ సంబంధిత శాఖ చూసే ఉన్నతాధికారి పదోన్నతులు పొందిన ఉద్యోగులకు ఆర్డర్లు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులు తమకు ఎప్పుడు పోస్టింగ్‌ వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగుల అంశం కాబట్టి ఆఫీసర్‌ పట్టించుకోలేదు అనుకోవచ్చు.. డిపార్ట్‌మెంట్‌ కు సంబంధించిన కీలక పనులను సదరు అధికారి గాలికొదిలేశారు. స్టేట్‌ విజిలెన్స్‌ కమిషన్‌ కు పంపాల్సిన రొటీన్ ఫైళ్లను ఆయన పెండింగ్‌ లోనే పెట్టారు. ఇలాంటివే డిపార్ట్‌మెంట్‌ లో 60 ఫైళ్లు పెండింగ్‌ లో ఉన్నాయని సమాచారం. లే ఔట్‌ పర్మిషన్‌ కోసం చేసుకున్న అనేక దరఖాస్తులు పెండింగ్‌లోనే పెట్టారు. అవి తాను క్లియర్‌ చేసేవి కాదని.. పైనుంచి బాస్‌ లు చెప్తేనే లే ఔట్లకు క్లియరెన్స్‌ ఇస్తానని ఉన్నతాధికారి ఓపెన్‌గానే చెప్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్న లే ఔట్లను పెండింగ్‌ లో పెట్టడంతో గతంలోనే సీఎంవో సీరియస్‌ అయినా ఆ అధికారి తీరులో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 800లకు పైగానే ఫైళ్లు పెండింగ్‌ లో ఉన్నాయని సమాచారం. ఫైళ్లు, లే ఔట్లు, ఇతర పనులకు అనుమతుల కోసం ఎంఏయూడీ ఆఫీస్‌ చుట్టూ బాధితులు తిరిగి తిరిగి విసుగెత్తిపోతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి తన సొంత శాఖలో జరుగుతున్న వ్యవహారాలు అసలు తెలుసా? ఆయనకు తెలియకుండానే ఉన్నతాధికారులు మేనేజ్‌ చేస్తున్నారా అని ఆ శాఖలోని ఉద్యోగులు వాపోతున్నారు.

First Published:  28 Nov 2024 11:44 AM IST
Next Story