Telugu Global
Telangana

బీజేపీ ఓ మిడతల దండు.. రాజాసింగ్ ప్రమాదకర వ్యక్తి..

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, బీజేపీ నాయకులు అలజడి సృష్టించేందుకు, ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని. ఓ వ్యూహం ప్రకారమే అరెస్ట్ అవుతున్నారని చెప్పారు.

బీజేపీ ఓ మిడతల దండు.. రాజాసింగ్ ప్రమాదకర వ్యక్తి..
X

తెలంగాణపై బీజేపీ మిడతల దండులా దాడి చేస్తోందని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బీజేపీ విధానాలు దేశ సమగ్రతకు పెను ప్రమాదంగా మారాయని.. బీజేపీ రాజకీయాల కారణంగా దేశం కల్లోలం అవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, బీజేపీ నాయకులు అలజడి సృష్టించేందుకు, ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓ వ్యూహం ప్రకారమే అరెస్ట్ అవుతున్నారని చెప్పారు.

రాజాసింగ్ తో ప్రమాదం..

రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు భట్టి విక్రమార్క. ఆయన మాటలు అల్లర్లకు దారితీసేలా ఉన్నాయని, రాజాసింగ్‌ ను కట్టడి చేయాలని చెప్పారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవ్యక్తి పరమత సహనాన్ని పాటించాలని, మిగతావారికి కూడా అదే సూచించాలని, కానీ ఇక్కడ ఆయనే మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. అధినాయకత్వం అండదండలతోనే ఆయన రెచ్చిపోతున్నారని, సస్పెన్షన్ వేటుతో సరిపెట్టకూడదని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజాసింగ్ ని కట్టడి చేయకపోతే, ఆ తర్వాత జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గతంలో కూడా..

రాజాసింగ్ కి ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదని, దళితుల మీద కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు భట్టి విక్రమార్క. తినే తిండి మీద కూడా మాట్లాడి అతను అవమాన పరిచాడని మండిపడ్డారు. సమాజానికి రాజాసింగ్ చాలా ప్రమాదమ‌ని, రాజ్యంగబద్దంగా అతనిపై బీజేపీ చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ బీజేపీ అతనిపై చర్యలు తీసుకోకపోతే.. ఆ పార్టీ విధానం కూడా రాజాసింగ్ లాంటిదేనని భావించాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ ప్రజల అప్రమత్తంగా ఉండాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దానికి భిన్నంగా ప్రవర్తిస్తే.. ఆ పదవికి అతడు అనర్హుడు అవుతాడని, కానీ.. రాజకీయ లబ్ది కోసం కొందరు పరిధికి మించి ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు భట్టి విక్రమార్క.

First Published:  25 Aug 2022 2:53 AM GMT
Next Story