Telugu Global
Telangana

ఒకే దగ్గర సమాధి చేయండి.. ఇదే మా చివరి కోరిక

కోడి భవ్య, గాదె వైష్ణవి భువనగిరి ఎస్సీ గురుకులాలో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యే వీళ్లిద్దరిపై 7వ తరగతి విద్యార్థులు టీచర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఒకే దగ్గర సమాధి చేయండి.. ఇదే మా చివరి కోరిక
X

యాదాద్రి జిల్లా భువనగిరిలో విషాదం నెలకొంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. భువనగిరి పట్టణంలోని ఎస్సీ గురుకులలో ఈ ఘటన జరిగింది. ఒకే గదిలో రెండు ఫ్యాన్లకు ఉరేసుకున్న విద్యార్థులు.. తాము ఎలాంటి తప్పుచేయలేదంటూ సూసైడ్‌ లెటర్‌ రాశారు.

సూసైడ్ లెటర్‌లో ఏముందంటే...

" మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే మేము ఆ మాటలు తీసుకోలేక పోతున్నాం. మమ్మల్ని శైలజా మేడమ్ తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. మా శైలజ మేడమ్‌ను ఎవరూ అనడానికి వీలులేదు. మా అమ్మ వాళ్లకంటే మమ్నల్ని ఎక్కువగా చూసుకున్నారు. సారీ మేడమ్. మా ఆఖరి కోరిక ఒకటే. మేము చనిపోయాక మా ఇద్దర్నీ ఒకే దగ్గర సమాధి చేయండి ప్లీజ్. కానీ, మా మేడమ్‌ని ఒక్క మాట కూడా అనకండి ప్లీజ్"

ఇతర విద్యార్థుల సమాచారం మేరకు అంబులెన్స్‌లో మృతదేహాలను భువనగిరిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన కుటుంబసభ్యులు తమ పిల్లల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లల మృతిపై వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు. మా పిల్లలది ఆత్మహత్య కాదు, ఉరేసి చంపారంటూ ఆరోపణలు చేశారు. విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇద్దరిదీ ఆత్మహత్యే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

మ్యాటర్‌లోకి వెళ్తే.. కోడి భవ్య, గాదె వైష్ణవి భువనగిరి ఎస్సీ గురుకులాలో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యే వీళ్లిద్దరిపై 7వ తరగతి విద్యార్థులు టీచర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమను వేధిస్తున్నారంటూ కొందరు జూనియర్స్‌ వీళ్లిద్దరిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వైష్ణవి, భవ్యకు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. అది తట్టుకోలేకే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

First Published:  4 Feb 2024 12:36 PM IST
Next Story