నేడు కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్‌పై క్లారిటీ!
తొలి జాబితాలో 55 మందిని ప్రకటించగా.. రెండో విడతలో మిగిలిన 65 టికెట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టుపై ఇవ్వాళ స్పష్టత రానున్నది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నేడు పరిశీలించి, ఫైనల్ చేయనున్నది. మొదటి లిస్టు విడుదల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి పెరిగింది. అనేక మంది ఆశావహులు లిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఈ క్రమంలో రెండో లిస్టు విడుదల తర్వాత పార్టీలో ఎలాంటి గందరగోళం ఏర్పడుతుందా అని కాంగ్రెస్ అధిష్టానం కంగారు పడుతోంది.
తొలి జాబితాలో 55 మందిని ఖరారు చేయగా.. రెండో విడతలో మిగిలిన 65 టికెట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. సీఈసీ మీటింగ్‌లో కూడా ఏవైనా సెగ్మెంట్లపై స్పష్టత రాకపోతే వాటిని హోల్డ్‌లోనే ఉంచే అవకాశం ఉన్నది. వాటిని మూడో జాబితా కింద ప్రకటిస్తారని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టు విడుదలపై ఇతర పార్టీలో కూడా ఆసక్తిగా ఎదరు చూస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి, బీఫామ్‌లు అందించింది. దీంతో తమకు ప్రత్యర్థులుగా ఎవరు వస్తారని ఆ పార్టీ ఎదురు చూస్తోంది.
కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టులో కీలకమైన నేతల పేర్లు ఉండనున్నాయి. బీసీ నాయకులు డిమాండ్ చేసినట్లు ఎంత మేరకు టికెట్లు ఇస్తారనే దానిపై కూడా ఆసక్తి నెలకొన్నది. అంతే కాకుండా కాంగ్రెస్, వామపక్షాల పొత్తు ఖరారు అయ్యింది. అయితే ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. సెకెండ్ లిస్ట్ కన్ఫార్మ్ అయితే అందులోనే వామపక్షాలకు కేటాయించిన సీట్లపై క్లారిటీ రానున్నది.
వామపక్షాలకు కేటాయించిన సీట్లలో టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహులకు ముందుగానే సమాచారం ఇస్తారని తెలుస్తున్నది. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించడానికి జానారెడ్డి టీమ్ కూడా సిద్ధంగా ఉన్నది. సీఈసీ భేటీ సమయంలోనే జానారెడ్డి బృందానికి టికెట్లు రాని నేతల వివరాలు అందించే అవకాశం ఉన్నది. ఆయా నాయకులను బుజ్జగించి పార్టీని వీడకుండా చేయాలని ప్రయత్నించనున్నారు. మొత్తానికి తొలి జాబితా కంటే రెండో జాబితానే కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నది.