రూ.400 కోట్లతో హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్
బేగంపేట విమానాశ్రయంలో రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రీసెర్చ్ సెంటర్‌లో ఏవియేషన్‌కు సంబంధించిన సరికొత్త టెక్నాలజీపై పరిశోధనలు జరుగనున్నాయి.
అనేక అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచానికే హబ్‌గా మారుతోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో కూడా నగరం తనదైన ముద్ర వేసింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల కారణంగా అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్లు, శాటిలైట్లు హైదరాబాద్‌లోనే తయారయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పుతోంది.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (కారో - సీఏఆర్వో)ను నగరంలో ఏర్పాటు చేయనున్నది. బేగంపేట విమానాశ్రయంలో రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రీసెర్చ్ సెంటర్‌లో ఏవియేషన్‌కు సంబంధించిన సరికొత్త టెక్నాలజీపై పరిశోధనలు జరుగనున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ఆధ్వర్యంలో ఈ రీసెర్చ్ సెంటర్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జూలైలోగా ఈ సెంటర్ అందుబాటులోకి రానున్నది.
కారోలో ఎయిర్ నేవిగేషన్ సర్వీసెస్‌కు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కమ్యునికేషన్స్ డొమైన్ సిమ్యులేటర్స్, నెట్‌వర్క్ ఎమ్యులేటర్, విజువలైజేషన్ అండ్ అనాలసిస్ ల్యాబ్, సర్‌వైవలెన్స్ ల్యాబ్స్ నేవిగేషన్ సిస్టమ్స్, ఎమ్యులేషన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్, సైబర్ సెక్యూరిటీ అండ్ థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్, డేటా మేనేజ్‌మెంట్ సెంటర్, ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అండ్ టూల్స్ సెంటర్‌తో పాటు నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న 'కారో' ఏసియాలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలిగి ఉన్న రీసెర్చ్ సెంటర్‌గా నిలువనున్నది. తెలంగాణకు ఈ సెంటర్ రావడం అంటే నగరం మరో మెట్టు ఎదిగినట్లే. ఇండియాలో సివిల్ ఏవియేషన్ రంగం మరింతగా అభివృద్ధి చెందడానికి 'కారో' ఉపయోగపడనున్నది. తెలంగాణ యువతకు ఈ సెంటర్ వల్ల ఉద్యోగాలు రావడమే కాకుండా.. సివిల్ ఏవియేషన్ రంగంలో అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే అవకాశం ఉంటుంది. బేగంపేట ఎయిర్‌పోర్టు డిఫెన్స్ విభాగానికి చెందినది. అందుకే కేంద్ర ప్రభుత్వ దీన్ని రీసెర్చ్ సెంటర్ కోసం ఉపయోగించుకోనున్నట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు.