కేసీఆర్, జగన్‌పై చిరంజీవి పంచ్‌లు
ఎక్కడైతే కళాకారులు సత్కరించబడతారో, గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కళాకారులకు అవార్డు వచ్చిందంటే ఓ ప్రభుత్వం స్పందించడం, వాళ్లని సత్కరించడం గతంలోనే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే జరిగింది.
తెలంగాణకు చెందిన పద్మ అవార్డు గ్రహీతలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మరాయి.
చిరంజీవి ఏమన్నారంటే.. "ఎక్కడైతే కళాకారులు సత్కరించబడతారో, గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కళాకారులకు అవార్డు వచ్చిందంటే ఓ ప్రభుత్వం స్పందించడం, వాళ్లని సత్కరించడం గతంలోనే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే జరిగింది. మన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే దీనంతటికీ కారణం. మనవాళ్లను మనం సత్కరించుకోకపోతే ఎలా అని వాళ్లు ముందుకు రావడం నిజంగా అభినందనీయం. కళాకారులకు కొత్త ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను చూస్తే నా మనసు పులకించిపోతోంది".
"గతంలో నంది అవార్డులు ఇచ్చుకున్నాం. కానీ తర్వాత, తర్వాత ఇరు రాష్ట్రాల్లో అది గత చరిత్రలా అయిపోయింది. ఆ విషయంలో మా అందరికీ అసంతృప్తి ఉంది. కళాకారులను ఇంతలా ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు అనిపించేది. అవార్డులు ఇవ్వడం అదేం పెద్ద కష్టమైన పనేం కాదు. అవార్డులతో ప్రోత్సహిస్తే కళాకారులు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. సినిమారంగం, నాటకరంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇవాళ మన తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది అంటే.. జనం నుంచి ప్రోత్సాహం అందడం వల్లే. అదే ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహం దక్కుతే అది ఇంకోస్థాయికి వెళ్తుంది. ఆ విషయాన్ని ఈనాటి ప్రభుత్వం గుర్తించింది. అందుకే నంది అవార్డులను మళ్లీ పునరుద్ధరించింది. అదికూడా పాటే ప్రాణంగా బతికిన ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు మీద అవార్డులను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం నిజంగా అభినందనీయం. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక అభినందనలు" అన్నారు చిరంజీవి.