Chiranjeevi: క్యాన్సర్ చిరంజీవికి కాదు... తెలుగు జర్నలిజానికి
Chiranjeevi Health: లేనిపోని రోగానికి ఈ పరామర్శలేంటని చిరంజీవి చిన్నబుచ్చుకున్నారు. మీడియా అరాచకానికి మండిపడ్డారు. అవగాహన రాహిత్యంతో అవాకులు చెవాకులు రాయకండి అంటూ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.
వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం జర్నలిజం ఎంతకి దిగజారిందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. మిగతా చోట్ల కూడా పరిస్థితి ఇలాగే ఉన్నా.. ముఖ్యంగా తెలుగు జర్నలిజంలో నీచాతి నీచాలు, దారుణాతి దారుణాలు కోకొల్లలు. ఆమధ్య హాస్య నటుడు సుధాకర్ చనిపోయాడంటూ వార్తల్ని వైరల్ చేశారు. చివరకు ఆయనే "నేను బతికున్నాను మహాప్రభో" అంటూ మీడియా ముందుకొచ్చారు. ఇటీవల వరుణ్ తేజ్ ఫలానా హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నాడనే సంచలన వార్త కూడా వ్యూస్ కోసమేనని వేరే చెప్పక్కర్లేదు. ఆస్పత్రి బెడ్ పై ఉన్న శరత్ బాబుని నెలరోజుల ముందే చంపేసిన చరిత్ర తెలుగు జర్నలిస్ట్ లలో కొందరిది. పేపర్ పై హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి.. వెబ్ సైట్లో రోగాలు అంటించడం పెద్ద గొప్పేం కాదు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా క్యాన్సర్ అంటగట్టారు కొంతమంది జర్నలిస్ట్ లు. ఆయన చెప్పింది ఒకటైతే వీరు రాసింది మరొకటి. కేవలం వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం చిరంజీవికి క్యాన్సర్ ని అంటగట్టేశారు.
క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన, క్యాన్సర్ నిర్థారణ పరీక్షల ఆవశ్యకత గురించి చెబుతూ తన ఆరోగ్యం గురించి చిరంజీవి చెప్పిన మాటలు సంచలనం అయ్యాయి. చిరంజీవి చెప్పింది ఒకటైతే, వెబ్ సైట్లలో వచ్చిన వార్తలు వేరు. కొన్నిపేరుగొప్ప మీడియా ఛానల్స్ లో కూడా స్క్రోలింగ్ లు రావడంతో చిరంజీవికి ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. అయ్యోపాపం చిరంజీవి గారూ.. అంటూ సన్నిహితులు కూడా ఫోన్ చేసి పరామర్శించారు. లేనిపోని రోగానికి ఈ పరామర్శలేంటని చిరంజీవి చిన్నబుచ్చుకున్నారు. మీడియా అరాచకానికి మండిపడ్డారు. అవగాహన రాహిత్యంతో అవాకులు చెవాకులు రాయకండి అంటూ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
సెన్సేషన్ కోసం ఏదయినా రాసేయడం, జంటల్ని విడదీయడం, లేనిపోని కొత్త సంబంధాలు అంటగట్టడం, బాగున్నవారికి రోగాలంటగట్టడం, బతికున్నవారిని చంపేయడం.. ఇటీవల డిజిటల్ జర్నలిజానికి అలవాటుగా మారిపోయింది. థంబ్ నెయిల్ చూసి వార్త చదవాలంటే కచ్చితంగా ఏదో ఒక సంచలనమే కావాలనుకుంటున్నారు. అప్పటికప్పుడు సంచలనాలు దొరకవు కాబట్టి, తమకు తామే పుకార్లు పుట్టిస్తున్నారు. ఆ తర్వాత వివరణలు ఇచ్చుకుంటున్నారు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరికో జరిగే నష్టంతో తమకు పనేంటి, తమకి వ్యూస్ వచ్చాయికదా అని సంబరపడిపోయే చౌకబారు జర్నలిస్ట్ ల కాలం ఇది. చిరంజీవి లాంటి వారికి కూడా ఈ కష్టాలు తప్పలేదు మరి.
క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. చిరంజీవికి క్యాన్సర్ అని, క్యాన్సర్ ని చిరంజీవి జయించారని రాసేశారు. ఆయన అభిమానులు ఆందోళనపడ్డారు. సన్నిహితులు నేరుగా ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో ఈ కన్ఫ్యూజన్ కు చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా అసలు విషయం చెప్పారు. క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో తాను చేసిన వ్యాఖ్యలను జర్నలిస్ట్ లు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని మాత్రమే తాను చెప్పానని అన్నారు చిరంజీవి. తాను కొలొనో స్కోప్ టెస్ట్ చేయించుకోవడం వల్ల పాలిప్స్ ని పసిగట్టి ముందుగా తీసేశారని, ఆ టెస్ట్ చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ గా మారేదేమో అని మాత్రమే తాను చెప్పానన్నారు. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేయించుకోవాలని సూచించానన్నారు. అయితే తన వ్యాఖ్యల్ని సరిగా అర్థం చేసుకోకుండా అవగాహనా రాహిత్యంతో తప్పుడు వార్తల్ని ఇచ్చారని మండిపడ్డారు. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయొద్దు, అభిమానుల్ని భయభ్రాంతుల్ని చేయొద్దు అని కాస్త గట్టిగానే గడ్డిపెట్టారు.