Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వం ఘనత.. పత్తి చేలల్లో బాల కార్మికులు పూర్తిగా నిర్మూలన

దేశంలో పండే పత్తిలో 15 శాతం తెలంగాణ నుంచే వస్తోంది. దీంతో కార్మికుల కొరత ఎక్కువగా ఉండి.. బాలలను పనుల్లో పెట్టుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఘనత.. పత్తి చేలల్లో బాల కార్మికులు పూర్తిగా నిర్మూలన
X

బాలల హక్కుల సంఘాలు, కార్మిక శాఖ కలిసి గత మూడేళ్లుగా చేపట్టిన చర్యలతో తెలంగాణలోని పత్తి చేలల్లో బాల కార్మికులను పూర్తిగా నిర్మూలించగలిగారు. దేశంలోని మరే రాష్ట్రం కూడా సాధించని ఘనతను తెలంగాణ సొంతం చేసుకున్నది. మూడేళ్లుగా క్రమం తప్పకుండా పత్తి చేలల్లో పని చేస్తున్న బాల కార్మికులను తిరిగి బడికి పంపడానికి ప్రభుత్వం కృషి చేసింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్‌తో కలిసి స్థానిక హక్కుల సంఘాలు, కార్మిక శాఖ నిరంతరం ప్రతీ గ్రామంలో తిరుగుతూ పత్తి చేలపై నిఘా ఉంచింది. 'ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ అండ్ రైట్స్ ఎట్ వర్క్ ఇన్ కాటన్ సప్లయ్ చైన్' అనే ప్రత్యేక ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ చేనులో కూడా బాలలు పని చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో మూడేళ్లలోనే బాల కార్మిక వ్యవస్థ మాయం అయ్యిందని హక్కుల కార్యకర్తలు తెలియజేస్తున్నారు.

కాటన్ ఫీల్డ్స్‌కు సంబంధించి పలు మార్గాల ద్వారా, అనేక రిపోర్టులను తెప్పించుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బాల కార్మికులు పూర్తిగా నిర్మూలించబడినట్లు తేల్చింది. తెలంగాణ కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ ఈ. గంగాధర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని నల్గొండ, వరంగల్ రూరల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పత్తి ఎక్కువగా పండుతుంది. పత్తి తీయడానికి కార్మికుల కొరత ఉండటంతో పలు ప్రాంతాల్లో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని, స్కూల్ విద్యార్థులను కూలీలుగా వాడుతున్నారు. చాలా మంది స్కూల్స్ ఎగ్గొట్టి పత్తి ఏరడానికి వెళ్తున్నట్లు గుర్తించారు. పత్తి ఏరడానికి వెళ్లే చిన్నారులు చదువుకు దూరం కావడమే కాకుండా.. అనేక శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. పలు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్స్, స్థానిక బాలల హక్కుల సంఘాలు కూడా దీనిపై దృష్టిపెట్టాయి.

మూడేళ్లుగా గ్రామాల్లో అవగాహన కల్పించడమే కాకుండా.. స్కూల్ డ్రాపవుట్స్‌ను గుర్తించి.. వాళ్లు పత్తి చేలల్లో పని చేస్తున్నట్లయితే వెంటనే అక్కడ పని మాన్పించడం వంటి చర్యలు చేపట్టారు. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పత్తి ఎక్కువగా పండిస్తారు. దేశంలో పండే పత్తిలో 15 శాతం తెలంగాణ నుంచే వస్తోంది. దీంతో కార్మికుల కొరత ఎక్కువగా ఉండి.. బాలలను పనుల్లో పెట్టుకుంటున్నారు.

సొంత పొలాల్లో పనిచేసే బాలలు, క్యాజువల్ లేబర్‌గా వెళ్లే బాలలు, కూలి పనులు చేసే కుటుంబాలు చేసుకున్న ఒప్పందాల్లో ఉన్న బాలలు ఎక్కువగా ఉన్నట్లు ఒక నివేదికలో వెల్లడైంది. పొలం యజమానుల నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేక.. ఇంటిలో ఉండే పిల్లలను ఇలా పనులకు పంపుతున్నట్లు గుర్తించారు. చాలా మంది పొలం యజమానులు కూడా 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండే బాలలనే కూలీలుగా ఉంచుకుంటున్నారు. చాలా చురుకుగా పనిచేయడమే ఇందుకు కారణమని నివేదికలో చెప్పారు. మరోవైపు గ్రామాల్లోని ఉపాధ్యాయులు కూడా డ్రాపవుట్స్‌పై దృష్టి పెట్టడం లేదని తేల్చారు. ఈ లోపాలన్నింటినీ సరి చేసుకుంటూ.. గత మూడేళ్లుగా కఠినమైన పర్యవేక్షణ పెట్టారు. దీంతో ఈ సారి బాల కార్మకులు ఎవరూ పత్తి చేలల్లో కనిపించడం లేదని కార్మిక శాఖ స్పష్టం చేసింది.

First Published:  21 April 2023 10:30 AM IST
Next Story