Telugu Global
Telangana

బీజేపీలోకి చీకోటి.. ఇంత కథ నడిచిందా..?

ఎట్టకేలకు చీకోటి మెడలో కాషాయ కండువా పడింది. కిషన్ రెడ్డి మొహం చాటేయడంతో.. డీకే అరుణతో మమ అనిపించారు.

బీజేపీలోకి చీకోటి.. ఇంత కథ నడిచిందా..?
X

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకుని తన పంతం నెగ్గించుకున్నారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా కుదరలేదు, కానీ ఇప్పుడు ఆ ముహూర్తం రానే వచ్చింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం విశేషం.

పెద్ద తతంగం..

క్యాసినో కింగ్ గా పేరుపడిన చీకోటి ప్రవీణ్ ని బీజేపీలో చేర్చుకోవడం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇష్టం లేదు. కానీ ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టగల సౌండ్ పార్టీ కావడంతో అధిష్టానం ఆయన్ను ఆదరించాలనుకుంది. ఇది ఇష్టంలేని కిషన్ రెడ్డి కొన్నాళ్లుగా చీకోటిని దూరం పెడుతూ వచ్చారు. ఓసారి మందీమార్బలంతో పార్టీలో చేరేందుకు ఆఫీస్ కి వెళ్లిన చీకోటి ప్రవీణ్ అక్కడ ఎవరూ లేకపోవడంతో షాకయ్యారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో తన పలుకుబడి ఉపయోగించి పంతం నెగ్గించుకున్నారు.

నడ్డా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..

ఇటీవల తెలంగాణకు వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. చీకోటికి లైన్ క్లియర్ చేశారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవాల్సిందేనని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు చీకోటి మెడలో కాషాయ కండువా పడింది. కిషన్ రెడ్డి మొహం చాటేయడంతో.. డీకే అరుణతో మమ అనిపించారు. హైదరాబాద్ పరిధిలో ఏదో ఒక నియోజకవర్గ నుంచి పోటీ చేయాలనేది చీకోటి ఆలోచన. అధిష్టానం అండదండలున్నాయి, తెలంగాణ బీజేపీలో పెద్దగా పోటీ కూడా లేదు కాబట్టి టికెట్ దొరకడం కష్టమేమీ కాదు. కానీ క్యాసినో కింగ్ ని పార్టీలో చేర్చుకున్నారు, టికెట్ కూడా ఇచ్చారనే నింద బీజేపీ మోయాల్సిందే.


First Published:  7 Oct 2023 11:08 AM GMT
Next Story