స్కూల్ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్.. అధికారులకు కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అమలును జిల్లా స్థాయిలో పర్యవేక్షించే భాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించబోతున్నట్టు చెప్పారు మంత్రి సబిత. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగుతుందన్నారు.
తెలంగాణలో దసరా నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’పేరుతో మధ్యాహ్న భోజనానికి కొనసాగింపుగా దీన్ని తెరపైకి తెస్తున్నారు. తమిళనాడులో అమలు చేసిన పథకాన్ని పరిశీలించి తెలంగాణలో దీన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ పథకం ఏర్పాట్లకు సంబంధించి అధికారుల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
సచివాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, విద్యాశాఖ అధికారులు, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి సంబంధించి మెనూను త్వరగా ఫైనలైజ్ చేయాలన్నారు మంత్రి సబిత. విధి, విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. దేశంలోనే పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం అందిస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా ఈ పథకం చేపడుతున్నామని అన్నారు మంత్రి సబిత.
అడిషనల్ కలెక్టర్లకు బాధ్యతలు..
ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అమలును జిల్లా స్థాయిలో పర్యవేక్షించే భాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించబోతున్నట్టు చెప్పారు మంత్రి సబిత. దీనికి సంబంధించి అవసరమైన వంట పాత్రలను సమకూర్చే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆమె ఆదేశాలిచ్చారు. ఈ పథకం ద్వారా 27,147 పాఠశాలల్లో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగుతుందన్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా కూడా పేద విద్యార్థులకోసం ఈ పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కి మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.