Telugu Global
Telangana

చిదంబరంకు వరుస కౌంటర్లు.. డైలమాలో కాంగ్రెస్

అప్పట్లో కేసీఆర్‌ నిరవధిక దీక్ష చేయకపోతే ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన చేసేవారా..? అని ప్రశ్నించారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ చరిత్రను చిదంబరం వక్రీకరించారని మండిపడ్డారు.

చిదంబరంకు వరుస కౌంటర్లు.. డైలమాలో కాంగ్రెస్
X

ఆమధ్య కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణలో ఐదుగంటల కరెంటు ప్రస్తావన చేయడంతో కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడ్డారు. 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రానికి వచ్చి 5 గంటలే కరెంటు ఇస్తామని చెప్పడమేంటని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ కి చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు చిదంబరం స్టేట్ మెంట్లపై వరుస కౌంటర్లిస్తున్నారు. ఆ పార్టీ మాజీ నేత పొన్నాల లక్ష్మయ్య చిదంబరం వ్యాఖ్యల్ని ఖండించారు.

అప్పట్లో కేసీఆర్‌ నిరవధిక దీక్ష చేయకపోతే ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన చేసేవారా..? అని ప్రశ్నించారు పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ చరిత్రను చిదంబరం వక్రీకరించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చిదంబరం వెనక్కి తీసుకోవడం వల్లనే వందలాది యువకులు బలయ్యారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అప్పటికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉందని పొన్నాల గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడటానికి తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలే లేరా అని ప్రశ్నించారు పొన్నాల. కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలను అప్పులు చేయకుండా, భూములు అమ్మకుండా అమలు చేయగలరా? అని నిలదీశారు. రాజ్యాంగానికి లోబడే తెలంగాణ అప్పులు తీసుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్లు అప్పులు చేసిందని వివరించారు. అప్పులు చేస్తున్న రాష్ర్టాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంటే, తెలంగాణ 22వ స్థానంలో ఉందని చెప్పారు పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్‌ నేతలకు దమ్ముంటే రాజస్థాన్‌ అప్పుల గురించి మాట్లాడాలని సవాల్‌ చేశారు పొన్నాల లక్ష్మయ్య.

First Published:  17 Nov 2023 7:41 AM IST
Next Story