బీఆర్ఎస్ నుంచి ఆరో వికెట్.. కాంగ్రెస్ లోకి చేవెళ్ల ఎమ్మెల్యే
2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కాలె యాదయ్య ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి వరుసగా గెలిచారు. ఈసారి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు అస్సలేమాత్రం తగ్గేలా లేవు. ఇటీవల వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా, జస్ట్ రెండు రోజులు గ్యాప్ తో మరో ఎమ్మెల్యే కారు దిగి హస్తం పార్టీ గూటిలో చేరారు. దీంతో మొత్తం బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్టయింది. ఈ సంఖ్య ఇక్కడితో ఆగుతుందా, ఇంకెంతమంది పార్టీ మారతారు.. అనేది తేలాల్సి ఉంది.
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. pic.twitter.com/ZiWgKooouU
— Telangana Congress (@INCTelangana) June 28, 2024
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీకి వెళ్లిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రోజుల వ్యవధలోనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పార్టీ మారినట్టయింది. గతంలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
తాజాగా పార్టీ మారిన కాలె యాదయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి వరుసగా గెలిచారు. ఈసారి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఆ పార్టీలోకి వెళ్లిపోవడం ఆయన ఆనవాయితీగా మార్చుకున్నారు. ఈ చేరికపై బీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది.