ఆ రెండు రైళ్లు ప్రారంభమయ్యేది చర్లపల్లి నుంచే
మరో మూడు రైళ్లకు చర్లపల్లి స్టాపేజీ.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభ స్టేషన్‌ను కొత్త టెర్నినల్ చర్లపల్లికి మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నిర్ణయం మార్చి నుంచి అమల్లోకి రానున్నది. అలాగే మూడు రైళ్లకు స్టాపేజీ ఇస్తున్నట్లు ప్రకటించింది. చెన్నై సెంట్రల్-హైదరాబాద్- చెన్నై సెంట్రల్ (12603/12604) టెర్మినల్‌ను హైదరాబాద్ (నాంపల్లి) నుంచి చర్లపల్లికి మార్చింది. ఈ నిర్ణయం మార్చి 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. అలాగే గోరఖ్‌పూర్-సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12589/12590) టెర్మినల్‌ను సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మార్చింది. ఈ నిర్ణయం మార్చి 12 నుంచి అమల్లోకి వస్తుంది.
మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు రైళ్లకు చర్లపల్లి టెర్మినల్‌లో స్టాపేజీ ఇస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో తెలిపారు. ఈ నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానున్నదని చెప్పారు. సికింద్రాబాద్-సిర్పూర్ ఎక్స్‌ప్రెస్ (12757) ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. 8.32కు చర్లపల్లికి చేరుకుని ఒక నిమిషం ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లికి రాత్రి 7.20 గంటలకు చేరుకుంటుంది.
గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (17201) చర్లపల్లిలో మధ్యాహ్నం 12.41కి, సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17202) మధ్యాహ్నం 12.50కి చర్లపల్లిలో ఆగుతాయి. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233) ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 3.47కి, సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17234) ఉదయం 9.20కి చర్లపల్లిలో ఆగనున్నాయి.