Telugu Global
Telangana

కాంగ్రెస్ కొనుగోళ్ల రాజకీయం.. వివేక్ పై సుమన్ తీవ్ర ఆరోపణలు

తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు.. వివేక్ కోట్ల రూపాయల ఆఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు బాల్క సుమన్. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు చూపించి ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ కొనుగోళ్ల రాజకీయం.. వివేక్ పై సుమన్ తీవ్ర ఆరోపణలు
X

కాంగ్రెస్ కొనుగోళ్ల రాజకీయం.. వివేక్ పై సుమన్ తీవ్ర ఆరోపణలు

ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకట స్వామి చెన్నూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఆయన బీఆర్ఎస్ నేతలకు ఎర వేస్తున్నట్టు ఆరోపణలు వినపడుతున్నాయి. చెన్నూరులో వివేక్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కొనుగోళ్ల రాజకీయానికి తెర తీశారని అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్. మరోసారి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్న సుమన్.. వివేక్ పై గెలుపు ధీమాతో ఉన్నారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బాల్క సుమన్, వివేక్ పోటీ పడ్డారు. తనపై ఉద్యమంలో పెట్టిన కేసులున్నాయని, వివేక్ కి వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని.. ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు సుమన్. చివరకు వివేక్ ని మట్టి కరిపించారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే మొదలు పెట్టారు సుమన్. వేల కోట్లు ఉన్న వివేక్‌కు.. వేల కోట్ల అభివృద్ధికి మధ్య చెన్నూరులో పోటీ జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలను కొనేందుకు వివేక్ వేలం పాట పెట్టారని ఆరోపించారు. చెన్నూరులో వివేక్‌.. బెల్లంపల్లిలో ఆయన సోదరుడు వినోద్‌ కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.

తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు.. వివేక్ కోట్ల రూపాయల ఆఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు బాల్క సుమన్. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని.. ఈ ఆధారాలన్నీ చూపించి ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఖరారు కాకపోవడంతో చెన్నూరు పెద్దగా వార్తల్లోకెక్కలేదు. ఇప్పుడు పాత ప్రత్యర్థుల మధ్య కొత్తపోరు అని తేలే సరికి చెన్నూరు రాజకీయం రసవత్తరంగా మారింది. గతంలో తనపై విజయం సాధించిన బాల్క సుమన్ పై ఈసారి ప్రతీకారం తీర్చుకోడానికి వివేక్ ప్రయత్నిస్తున్నారు. అందుకే చెన్నూరులో కోట్లు కుమ్మరిస్తున్నారని అంటున్నారు.

First Published:  5 Nov 2023 3:25 PM IST
Next Story