Telugu Global
Telangana

ఇకపై జిల్లాల్లోనే కీమోథెరపీ సదుపాయం.. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడి

తెలంగాణలో సీఎం కేసీఆర్ వైద్య సదుపాయాలను ఎంతో పటిష్టం చేశారని, గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే వంటి హాస్పిటళ్లను బలోపేతం చేశారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

ఇకపై జిల్లాల్లోనే కీమోథెరపీ సదుపాయం.. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడి
X

తెలంగాణలో క్యాన్సర్‌తో పోరాడుతున్న పేషంట్లు.. ప్రతీ సారి కీమోథెరపీ కోసం హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదని.. ఇకపై ప్రతీ జిల్లాలో కీమోథెరపీ చేయించుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో కొత్తగా నిర్మించిన ఆంకాలజీ బ్లాక్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..

క్యాన్సర్ రోగుల కోసం ఇలాంటి అధునాతన భవంతిని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అద్భుతమైన భవంతిని కట్టడానికి సహకరించిన అరబిందో ఫార్మాకు ధన్యవాదాలు తెలుపుతున్నమని హరీశ్ రావు చెప్పారు. ఈ కొత్త బిల్డింగ్ వల్ల గతంలో 400 బెడ్లగా ఉన్న అసుపత్రి 750కి పెరిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్ చికిత్స చేస్తున్న ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో ఎంఎన్‌జే దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇప్పుడు ఎంఎన్‌జే ఆసుపత్రి క్యాన్సర్ రంగంలో ఎంతో మెరుగైన సేవలను అందిస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ వైద్య సదుపాయాలను ఎంతో పటిష్టం చేయడంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే వంటి హాస్పిటళ్లు బలోపేతం అయ్యాయని తెలిపారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని ముఖ్యమైన ఆసుపత్రులను విస్తరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని చెప్పారు. నాలుగు టిమ్స్ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయని.. వరంగల్ హెల్త్ సిటీ అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నారు. తెలంగాణను పూర్తి ఆరోగ్య రాష్ట్రంగా మార్చడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని హరీశ్ రావు వెల్లడించారు. ఆరోగ్యంలో దేశానికి తెలంగాణ నిదర్శనంగా మార్చాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు.

పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కేవలం ఆసుత్రులను పునరుద్దరించడమే కాకుండా.. మరిన్ని మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించినట్లు హరీశ్ రావు తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. 2014లో 20 మెడికల్ కాలేజీలు ఉంటే 2022 నాటికి 46కు చేరుకున్నాయని, ఈ ఏడాదితో 55 అవుతాయని తెలిపారు. 65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు వస్తే 9 ఏండ్లల్లోనే 35 కాలేజీలు తెచ్చామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కాగా, ఎంఎన్‌జే ఆసుపత్రిలో క్యాన్సర్‌తో బాధపడే పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.


First Published:  16 April 2023 3:33 PM IST
Next Story