ఈ నెల 22న హైదరాబాద్ కు రానున్న చెగువేరా కూతురు, మనుమరాలు
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబాకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల మద్దతు కూడగట్టడంలో భాగంగా చెగువేరా కూతురు, మనుమరాలు మన దేశంలోని పలు రాష్ట్రాలను పర్యటించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 22న హైద్రాబాద్ రానున్నారు.
క్యూబా విప్లవ నాయకుడు, ప్రపంచ విప్లవకారుడు చెగువేరా కూతురు అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా హైదరాబాద్ కు రానున్నారు. వీరిద్దరూ కొద్ది రోజుల కిందట మన దేశానికి వచ్చారు. అలైద గువేరా వైద్యం కోసం కేరళ వెళ్ళారు. ఇప్పుడు వారిద్దరూ కేరళ నుంచి బయలుదేరి, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబాకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల మద్దతు కూడగట్టడంలో భాగంగా వారు దేశంలోని పలు రాష్ట్రాలనుపర్యటించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 22న హైద్రాబాద్ రానున్నారు.
వారికి హైద్రాబాద్ లో బీజేపీ,ఎంఐఎం మినహా మిగతా అన్ని పార్టీలు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.
వారి రాక సందర్భంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేయాలని బీజేపీ, ఎంఐఎంయేతర సంఘీభావ కమిటీ భావిస్తోంది. ఈ మేరకు ఈ కమిటీ ముఖ్దుం భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి, కమిటీ సభ్యులు డీజీ నర్సింహారావు, బాలమల్లేశ్, టీడీపీ నాయకుడు శ్రీపతి సతీష్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్ధన్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దిడ్డి సుధాకర్ తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ అలైద గువేరా రాక, సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఓ కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ నెల 22న సాయంత్రం రవీంద్ర భారతిలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో హైకోర్టు జడ్జి రాధారాణి, ప్రభుత్వ మాజీ సీఎస్ మాధవరావు, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నారు.