Telugu Global
Telangana

సొమ్ములుంటే చాలు..! బీజేపీలోకి చీకోటి

గ్యాంబ్లింగ్ వ్యవహారాల్లో చీకోటి పేరు దేశ విదేశాల్లో కూడా మారుమోగిపోయింది. క్యాసినో కేసులున్నాయి, ఈడీ కూడా విచారణ జరిపింది. అలాంటి వ్యక్తిని బీజేపీ ఎందుకు చేరదీస్తుందనేది పార్టీలోనే కొందరికి అంతుచిక్కడంలేదు.

సొమ్ములుంటే చాలు..! బీజేపీలోకి చీకోటి
X

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ గ్యాంబ్లర్ గా పేరున్న చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరబోతున్నారు. కాషాయ కండువా కప్పుకుని రాజకీయ రంగు పులుముకోబోతున్నారు. గ్యాంబ్లింగ్ వ్యవహారాల్లో చీకోటి పేరు దేశ విదేశాల్లో కూడా మారుమోగిపోయింది. క్యాసినో కేసులున్నాయి, ఈడీ కూడా విచారణ జరిపింది. అలాంటి వ్యక్తిని బీజేపీ ఎందుకు చేరదీస్తుందనేది పార్టీలోనే కొందరికి అంతుచిక్కడంలేదు. కొన్నాళ్లుగా ఈ చర్చ జరుగుతున్నా.. నాయకులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఫైనల్ గా చీకోటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈరోజు ఆయన సమక్షంలోనే చీకోటి బీజేపీలో చేరబోతున్నారు.

సొమ్ములుంటే చాలా..?

చీకోటి ప్రవీణ్ కి పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనేది తర్వాత విషయం. గతంలో ఏమేం చేసినా చేతిలో సొమ్ములుంటే కడిగిన ముత్యం అనిపించుకోవచ్చని చీకోటి నిరూపించారు. బీజేపీ కూడా ఇలాంటి వారిని సపోర్ట్ చేస్తూ తన స్థాయి ఏంటనేది బయటపెట్టుకుంది. పైగా పార్టీలో చేరే సందర్భంలో ఆయన, తనకు మోదీ ఆశయాలు నచ్చాయంటున్నారు.మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు చీకోటి.

ఈడీ కథ కంచికేనా..?

తమకు వ్యతిరేక పార్టీల్లో ఉంటే సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను రంగంలోకి దింపుతుంది బీజేపీ. ఒక్కసారి వారి ఒంటిపై కాషాయ కండువా పడితే మాత్రం పరిస్థితిలో మార్పు వస్తుంది. క్యాసినో కింగ్ అనే పేరున్న చీకోటి.. ఇప్పుడు బీజేపీలో చేరితే పాప పరిహారం పూర్తయినట్టే లెక్క. ఈడీ కథ కంచికే అనుకోవచ్చు. మరి చీకోటికి బీజేపీ టికెట్ ఇస్తుందా..? ఇస్తే ఏ నియోజకవర్గం నుంచి..? అనేది తేలాల్సి ఉంది.

First Published:  12 Sept 2023 8:10 AM IST
Next Story