లక్ష్మి గో బ్యాక్, బీజేపీ గో బ్యాక్.. చౌటుప్పల్ లో సీన్ రివర్స్..
తన భర్తను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించేందుకు రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి బీజేపీ కండువాతో కారు దిగారు. అయితే వారు కారు దిగిన వెంటనే గో బ్యాక్ అనే నినాదాలు మారుమోగాయి.
చౌటుప్పల్ లో బీజేపీ నేతలకు ఘోర అవమానం జరిగింది. ప్రచారానికి వచ్చినవారిని గో బ్యాక్.. గోబ్యాక్ అంటూ తరిమారు స్థానిక ప్రజలు. ఇటీవల రాజగోపాల్ రెడ్డికి కూడా మునుగోడులో ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి చౌటుప్పల్ లో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. లక్ష్మి గో బ్యాక్, బీజేపీ గో బ్యాక్ అంటూ ఆమెను ప్రచారానికి రానీయకుండా అడ్డుకున్నారు స్థానికులు.
సీనియర్ నేత డీకే అరుణతో కలసి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, చౌటుప్పల్ మండలం చిన్న కొండూర్ లో ప్రచారానికి వచ్చారు. తన భర్తను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించేందుకు లక్ష్మి బీజేపీ కండువాతో కారు దిగారు. అయితే వారు కారు దిగిన వెంటనే గో బ్యాక్ అనే నినాదాలు మారుమోగాయి. గతంలో అదే ప్రాంతంలో కాంగ్రెస్ కి ఓటు వేయాలంటూ రాజగోపాల్ రెడ్డి సతీమణి ప్రచారం చేశారు. ఈసారి పార్టీ మారింది, గుర్తు మారింది. స్థానిక ప్రజలు మాత్రం కాంగ్రెస్ తోనే ఉన్నారు. దీంతో వారంతా రాజగోపాల్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన సతీమణి ప్రచారాన్ని అడ్డుకున్నారు.
ద్రోహులకు చోటు లేదు..
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని, అలాంటి ద్రోహులను తమ గ్రామంలో అడుగు పెట్టనివ్వబోమంటూ అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి బీజేపీ నేతలెవరూ రావొద్దని చెప్పారు. గతంలో గ్రామాభివృద్ధికి ఇచ్చిన మాటలను పట్టించుకోలేదని, నాలుగేళ్లలో ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి తమ గ్రామానికి ఏం చేశారని నిలదీశారు. టీఆర్ఎస్ పై డీకే అరుణ విమర్శలు చేయబోగా.. ఆమెపై కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. కారు దిగిన బీజేపీ నేతలు నిరసనలు తట్టుకోలేక వెంటనే కారెక్కి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు.