Telugu Global
Telangana

భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్‌లో మార్పు? నేడు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్.!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ ప్రకటించి.. రాహుల్ యాత్ర 15 రోజులు ఉంటుందని చెప్పారు. కానీ ఏఐసీసీ మాత్రం 13 రోజులే యాత్ర సాగుతుందని చెప్పగా, యాత్ర పర్యవేక్షక బృందం మాత్రం 14 రోజులు యాత్ర ఉంటుందని ప్రకటించింది.

భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్‌లో మార్పు? నేడు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్.!
X

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంబంధించిన తెలంగాణ రూట్ మ్యాప్ విషయంలో టీపీసీసీ, ఏఐసీసీ మధ్య సమన్వయం లేకుండా పోయింది. రాష్ట్ర నేతలు రాహుల్ యాత్రకు రూట్ మ్యాప్ ఫిక్సయ్యిందని మక్తల్ నుంచి జుక్కల్ వరకు 15 రోజుల పాటు 350 కిలోమీటర్లు జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ ప్రకటించి.. రాహుల్ యాత్ర 15 రోజులు ఉంటుందని చెప్పారు. కానీ ఏఐసీసీ మాత్రం 13 రోజులే యాత్ర సాగుతుందని చెప్పగా, యాత్ర పర్యవేక్షక బృందం మాత్రం 14 రోజులు యాత్ర ఉంటుందని ప్రకటించింది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రకటనలు చేయగా.. అసలు యాత్ర ఎన్ని రోజులు, ఏ రూట్లో సాగుతుందో అనే కన్ఫ్యూజన్ మొదలైంది.

రాహుల్ పాదయాత్ర విషయంలో ఏర్పడిన గందరగోళానికి గురువారం చెక్ పడే అవకాశం ఉన్నది. ఏఐసీసీ జనరగల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. రాహుల్ పాదయాత్ర విషయంలో టీపీసీసీ ప్రకటించిన దానికి మార్పులు, చేర్పులు ఉంటాయని ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ ప్రకటించింది. గాంధీభవన్‌లో కేణుగోపాల్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు మరి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు. రాహుల్ గాంధీ ఒక రోజు ముందుగా ఈ నెల 23న రాష్ట్రానికి వస్తారని టీపీసీసీ ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 17న యాత్రకు బ్రేక్ పడే అవకాశం ఉంది. దీంతో యాత్ర కూడా ఒక రోజు ఆలస్యంగా కొనసాగుతుందని ఏఐసీసీ చెప్పింది.

తెలంగాణలో భారత్ జోడో యాత్ర 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో జరుగుతుందని ఏఐసీసీ ప్రకటించింది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ రూట్ మ్యాప్‌లో మార్పులు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా యాత్ర తప్పకుండా ఉండాలని పట్టుబట్టి రూట్ మ్యాప్ మార్చడంతో 17 సెగ్మెంట్లకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ ప్రకటన మేరకు మహబూబ్‌నగ్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని మక్తల్, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని రాజేంద్రనగర్, గోషామహల్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాంపల్లి, ఖైరతాబాద్, సనత్‌నగర్, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కూకట్‌పల్లి, మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగాల్సి ఉన్నది.

కాగా, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన రూట్ మ్యాప్‌లో మార్పులు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇలా పాదయాత్ర చేస్తే దూరం పెరగడంతో పాటు 15 బదులు 17 రోజులు నడవాల్సి ఉంటుందని.. అది ఆ తర్వాత రాష్ట్రాల యాత్రపై ప్రభావం పడుతుందని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే జోడోయాత్రలో మరోసారి మార్పులు చేస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో మూడు పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే సభల కోసం నిర్ణయించిన ప్రదేశాలపై టీపీసీసీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీకి అంతగా బలంలేని చోట పబ్లిక్ మీటింగ్స్ పెడితే ఆదరణ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ సభల నిర్వహణపై కూడా ఇవ్వాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.

First Published:  13 Oct 2022 7:33 AM IST
Next Story