యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట
గతంలో యాదగిరి గుట్టగా ఉన్న పేరును బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రిగా మార్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యాదాద్రి పేరును మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విధివిధానాలు రూపొందించాలని అధికారులను కోరారు. యాదగిరిగుట్ట బోర్డుకు తిరుమల స్థాయిలో ప్రాధాన్యత ఉండేలా అధ్యయనం చేసి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.
కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కొరారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన ఫండ్స్ మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో రావాలని అదేశించారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలన్నారు.