Telugu Global
Telangana

తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ టీడీపీ.. బాబు ప్లాన్ అదేనా?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్కపోవడంతో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం..కాస్తో, కూస్తో బాబు సొంత సామాజికవర్గం ఉన్న ఖమ్మంలో కాంగ్రెస్‌కు బహిరంగంగానే మద్దతు తెలిపింది.

తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ టీడీపీ.. బాబు ప్లాన్ అదేనా?
X

తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగైన తెలుగుదేశం పార్టీ.. మళ్లీ పురుడుపోసుకోబోతుందా..! అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు.. తెలంగాణలో అక్కడో, ఇక్కడో మిగిలిన టీడీపీ నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక స్థానిక సంస్థల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించినట్లు సమాచారం.

తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభ వేగంగా తగ్గుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది టీడీపీ. ఐతే తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరకడం, చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వాన్ని అమరావతికి తరలించడం వెంటవెంటనే జరిగిపోయాయి. తర్వాత క్రమంగా తెలంగాణలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పలువురు టీఆర్ఎస్‌లో చేరగా.. కొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. తర్వాత ఆ ఇద్దరూ సైతం గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ తెలంగాణలో జీరో అయింది.

ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్కపోవడంతో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం..కాస్తో, కూస్తో బాబు సొంత సామాజికవర్గం ఉన్న ఖమ్మంలో కాంగ్రెస్‌కు బహిరంగంగానే మద్దతు తెలిపింది. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణలో మళ్లీ రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఐతే ఈ పరిణామాలపై తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు బహిరంగంగానే తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రేవంత్‌కు చంద్రబాబు శిష్యుడిగా పేరుందని..ఇద్దరూ కలిస్తే కార్పోరేట్‌ రాజకీయాలతో మళ్లీ తెలంగాణను ఆగం చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  1 Jun 2024 10:28 AM IST
Next Story