కాళేశ్వరానికి వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు : హరీష్ రావు
సీఎం చంద్రబాబు మాటల్లోనే సమన్యాయం ఉంది చేతల్లో లేదు అని హరీష్ రావు అన్నారు

కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తు ఏపీ సీఎం చంద్రబాబు 2018లో కేంద్రానికి లేఖ రాశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు. నిన్న ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివి అని, సమన్యాయం కోరుకుంటున్నాను అనడం హాస్యాస్పదం అన్నారు. అదే నిజమైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఎండబెట్టి, కుడి కాలువ నిండుగా నీళ్ళు తీసుకువెళ్లడం సమంజసమేనా, సమన్యాయమేనా? అని ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండలో నీళ్ళు లేక పంటలు ఎండుతున్నాయని ఆ పాపం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన గురువు చంద్రబాబుది అని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కృష్ణా జలాల్లో ఏపీ 512 టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవాల్సింది. ఇప్పటికే 657 టీఎంసీల నీరు వాడుకుంటున్నారని... తెలంగాణకు 343 టీఎంసీలు రావాల్సింది, 220 టీఎంసీలు మాత్రమే వచ్చిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు తెలంగాణ అన్యాయం చేశారని... రేపటి రోజున తెలంగాణలో తాగునీటికి, సాగునీటికి తీవ్ర కరువు ఏర్పడనుందని ఇది సమన్యాయం ఎలా అవుతుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి బంకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నామని అంటున్నారని, నిజానికి గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లాడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు గోదావరి జలాల్లో 968 టీఎంసీలు రావాల్సి ఉండగా.. వాస్తవానికి ఎన్నడు కూడా 200 టీఎంసీల నీటిని కూడా ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు ఇవ్వలేదని అన్నారు. అందుకే 240 టీ ఎంసీల నీటికోసం కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ సాధించారని.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన గోదావరిపై ఇంకా నిర్మించాల్సిన ప్రాజెక్టుల డీపీఆర్ లు వెనక్కి వస్తున్నాయని అని హరీష్ రావు ఫైర్‌య్యారు. పాలమూరు, దిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు చంద్రబాబు ఎందుకు అడ్డం పడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. మేము మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కట్టుకోవద్దా అని ప్రశ్నించారు