ఇకపై ఇన్ పేషెంట్.. ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు
కంటి ఆపరేషన్ కోసం ఆయన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంది. అయితే ఇతర సమస్యలతో ఇప్పుడు AIGలో చేరారు చంద్రబాబు.

జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత హుషారుగా కనిపించిన చంద్రబాబు ఇప్పుడు ఆస్పత్రిలో చేరారు. ఏ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారు అనే విషయంపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు కానీ.. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(AIG)లో ఆయన ఇన్ పేషెంట్ గా చేరారని మాత్రం నిర్థారణ అయింది.
డాక్టర్ల సూచన మేరకు..
అక్టోబర్ 31 మంగళవారం చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అదేరోజు హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. బుధవారం చంద్రబాబు ఇంటికి వచ్చి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్య సమస్యలపై అవగాహనకు వచ్చారు. ఆయన్ను గురువారం ఆస్పత్రికి రావాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ఈ రోజు ఉదయం చంద్రబాబు AIGకి వచ్చారు. ఉదయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం ఆయనను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు.
హెల్త్ బులిటెన్ లు ఉంటాయా..?
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేయాల్సి ఉంది. అది బయటకు వస్తే కానీ ఆయనకు ఉన్న సమస్య ఏంటి, జరుగుతున్న చికిత్స ఏంటి అనే దానిపై క్లారిటీ వస్తుంది. కంటి ఆపరేషన్ కోసం ఆయన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంది. అయితే ఇతర సమస్యలతో ఇప్పుడు AIGలో చేరారు చంద్రబాబు. ఇక్కడ కోలుకున్న తర్వాత కంటి ఆపరేషన్ కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లే అవకాశముంది.
♦