Telugu Global
Andhra Pradesh

ఆ విషయం హైలైట్ కావాల్సిందే.. ఈనెల 28న ఢిల్లీకి చంద్రబాబు

కేంద్ర ఎన్నికల కమిషనర్ అపాయింట్‌మెంట్ కోరుతూ టీడీపీ కార్యాలయం ఓ లేఖ రాసింది. చంద్రబాబు ఈనెల 28న ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. వైసీపీపై ఫిర్యాదు చేయడానికి ఆయన రెడీ అయ్యారు.

ఆ విషయం హైలైట్ కావాల్సిందే.. ఈనెల 28న ఢిల్లీకి చంద్రబాబు
X

"ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ దొంగ ఓట్లపైనే ఆధారపడింది" టీడీపీ ప్రధాన ఆరోపణ ఇది. గతంలో స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ ఇలాగే గెలిచిందంటూ ఆరోపించారు. ఇప్పుడు మరోసారి ఏపీలో దొంగ ఓట్ల కలకలం రేగింది. ఆ నింద పూర్తిగా వైసీపీపైనే వేస్తున్నారు టీడీపీ నేతలు. ఇటీవలే అనంతపురం జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. గతంలో అనంతపురం జెడ్పీ సీఈఓగా పనిచేసిన శోభ స్వరూపరాణి అనే అధికారిణిపై కూడా ఇప్పుడు ఈసీ చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది. ఏపీలో వైసీపీ పూర్తిగా దొంగ ఓట్లపైనే ఆధారపడిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారాన్ని మరింత హైలైట్ చేయడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈనెల 28న ఆయన ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో బోగ‌స్‌ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది.

కేంద్ర ఎన్నికల కమిషనర్ అపాయింట్‌మెంట్ కోరుతూ టీడీపీ కార్యాలయం ఓ లేఖ రాసింది. ఏపీలో వైసీపీ దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడం.. అనే రెండు అంశాలపై చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేస్తారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఆయన సీఈసీకి అందజేస్తారని తెలుస్తోంది. ఉరవకొండ ఉదంతంపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ గతేడాది అక్టోబరు 27న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 4న ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలకు ఆదేశించింది. ఇద్దరు అధికారులపై వేటుపడింది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఏపీలో వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ, జనసేన కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడీ వ్య‌వ‌హారంపై ఢిల్లీ స్థాయిలో చర్చ పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు. మరి ఆయన వ్యూహం ఫలిస్తుందా..? ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు ఏం సాధిస్తారనేది వేచి చూడాలి.

*

First Published:  22 Aug 2023 12:06 PM IST
Next Story