Telugu Global
Telangana

మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం..

ఏపీలో పునర్వైభవం వచ్చినట్టే, తెలంగాణలో కూడా టీడీపీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు.

మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం..
X

రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు ప్రతిపాదించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లు అని పేర్కొన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. తెలంగాణ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో పార్టీ గెలుపుకి తెలంగాణలోని టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశాయన్నారు.

పునర్వైభవం..

ఏపీలో పార్టీకి పునర్వైభవం వచ్చినట్టే, తెలంగాణలో కూడా టీడీపీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు. తెలంగాణ నేతలు, కార్యకర్తల అభిమానం చూస్తుంటే తనకు కొత్త ఉత్సాహం వస్తోందన్నారు. తెలంగాణలో పార్టీని వదిలింది కేవలం నేతలేనని, కార్యకర్తలు మాత్రం టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారని అభినందించారు. అధికారంలో లేకపోయినా కూడా కార్యకర్తలు పార్టీని వీడి వెళ్లలేదని పేర్కొన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందన్నారు చంద్రబాబు.


సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చామని చెప్పారు చంద్రబాబు. తనను జైలులో పెట్టినప్పుడు టీడీపీ శ్రేణులురెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ర్యాలీలు చేపట్టాయని, సభలు పెట్టాయని, తెలంగాణకు సంబంధించి గచ్చిబౌలి సభను తాను మరచిపోలేనన్నారు. ఇక విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీపై కూడా చంద్రబాబు స్పందించారు. సమస్యల పరిష్కారానికి తాను చొరవ తీసుకున్నానని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారని, ఆయనకు కృతజ్ఞతలు అని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు చంద్రబాబు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలనతోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఏపీని ఇంకా ఓ భూతం పట్టుకుని వేలాడుతోందని, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు

First Published:  7 July 2024 5:17 PM IST
Next Story