Telugu Global
Telangana

ముక్కు నేలకు రాస్తా.. నేను రాజీనామా చేస్తా

జగదీష్ రెడ్డి ఛాలెంజ్ ని తాను ఒప్పుకుంటున్నట్టు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. నల్లగొండ ఎస్పీ నుంచి రికార్డ్ తెప్పించుకోవాలన్నారు. అన్నీ నిరూపిస్తానని, లేకపోతే మంత్రి పదవి వదిలేసి బయటకు వెళ్లిపోతానన్నారు.

ముక్కు నేలకు రాస్తా.. నేను రాజీనామా చేస్తా
X

సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన తెలంగాణ అసెంబ్లీ అర్ధరాత్రి 1.30 గంటలు దాటాక కూడా కొనసాగింది. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ప్రస్తుత బడ్జెట్ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య సవాళ్లతో సభ వేడెక్కింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై వాడివేడి వాదనలు జరుగుతున్న సందర్భంలో.. మంత్రి కోమటిరెడ్డి, జగదీష్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. జగదీష్ రెడ్డిపై హత్య కేసులు, దొంగతనం కేసులు, మద్యం కేసులు ఉన్నాయని అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

ఓ హత్య కేసులో ఏ-2, మరో కేసులో ఏ-6, ఇంకో కేసులో ఏ-7గా జగదీష్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య సభలో గందరగోళం నెలకొంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

మంత్రి ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం కాదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అందులో ఒక్కటి నిజం అని నిరూపించినా ఇదే సభలో తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి రాజీనామాలు చేస్తారా అని ప్రశ్నించారు. మంత్రి మాటలను రికార్డుల నుంచి తొలగించండి లేదంటే తన సవాల్ కి సిద్ధంగా ఉండండి అని అన్నారు జగదీష్ రెడ్డి.

ఛాలెంజ్ యాక్సెప్టెడ్..

జగదీష్ రెడ్డి ఛాలెంజ్ ని తాను ఒప్పుకుంటున్నట్టు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. నల్లగొండ ఎస్పీ నుంచి రికార్డ్ తెప్పించుకోవాలన్నారు. అన్నీ నిరూపిస్తానని, లేకపోతే మంత్రి పదవి వదిలేసి బయటకు వెళ్లిపోతానన్నారు. ఓ దశలో స్పీకర్ జోక్యం చేసుకుని సభను డీవియేట్ చేయొద్దని కోరారు. అయినా కూడా మరికొంతసేపు ఈ సంవాదం జరిగింది.

First Published:  30 July 2024 6:38 AM IST
Next Story