Telugu Global
Telangana

మంచి పనితీరు ప్రదర్శిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలి: KTR

సిఐఐ వార్షిక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా తయారీ కేంద్రంగా అవతరించనున్న హైదరాబాద్ కు కేంద్రం నుండి ఎలాంటి మద్దతులేదని ఆరోపించారు.

మంచి పనితీరు ప్రదర్శిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలి: KTR
X

భారతదేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందితే భారతదేశం ఇప్పటికే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించి ఉండేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంచి పనితీరు కనబరుస్తున్న తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని ఆయ‌న ఆరోపించారు.

సిఐఐ వార్షిక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా తయారీ కేంద్రంగా అవతరించనున్న హైదరాబాద్ కు కేంద్రం నుండి ఎలాంటి మద్దతులేదని ఆరోపించారు. రాష్ట్రానికి బల్క్ డ్రగ్స్ తయారీ క్లస్టర్, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్లు కేంద్రం నిరాకరించిందని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తామని హామీ ఇచ్చినా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఏమీ ఇవ్వలేదన్నారు కేటీఆర్.

''భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉన్నప్పటికీ, అన్ని రాష్ట్రాలు ఒకేరకంగా ఉండవు. ప్రతి రాష్ట్రం వైవిధ్యమైనది. ఆ వైవిధ్యాన్ని గౌరవించాలి. కేంద్రం రాష్ట్రానికి మద్దతిస్తుందా లేదా అన్నది రాజకీయాలు నిర్ణయించకూడదు. మంచి పనితీరు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు అందించాలి''అని కేటీఆర్ కోరారు.

‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలు మంచివే అయినా, అవి నినాదాలుగానే మిగిలిపోయాయి. దిగుమతి ఖర్చులు, దూరం , ఇతర అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ అనేక వస్తువులను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దానికి అక్కడి వస్తువులు చౌకగా రావడమే కారణం. చైనాలో మేకింగ్ ఎందుకు చౌకగా ఉంటుందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి" అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ 2030 నాటికి లైఫ్‌సైన్సెస్ సెక్టార్ విలువను సుమారు 250 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ తెలిపారు.

First Published:  7 March 2023 4:17 PM IST
Next Story