Telugu Global
Telangana

నీటి వనరుల పునరుద్ధరణలో తెలంగాణ పట్ల కొనసాగుతున్న కేంద్రం వివక్ష

గత‌ వారం కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లోక్ స‌భ ముందు ఉంచిన గణాంకాల ప్రకారం, గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో, తెలంగాణలోని నీటి వనరుల మరమ్మతులు, పునరుద్ధరణల కోసం కేంద్రం ఎటువంటి నిధులను విడుదల చేయలేదు.

నీటి వనరుల పునరుద్ధరణలో తెలంగాణ పట్ల కొనసాగుతున్న కేంద్రం వివక్ష
X

తెలంగాణ పట్ల కేంద్రం కొనసాగిస్తున్న వివక్షల పరంపరలో నీటి వనరుల పట్ల సాగుతున్న వివక్ష ఒకటి.

తెలంగాణలోని నీటి వనరుల మరమ్మతులు, పునరుద్ధరణల విషయంలో కేంద్రం చిన్న చూపుచూస్తోంది. . మిషన్ కాకతీయ గురించి పార్లమెంటు సాక్షిగా పొగడ్తలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వం అందుకోసం సహాయం చేయడంలో మాత్రం వెనకబడే ఉంది.

ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం లోక్ సభ ముందు ఉంచిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

గత‌ వారం కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లోక్ స‌భ ముందు ఉంచిన గణాంకాల ప్రకారం, గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో, తెలంగాణలోని నీటి వనరుల మరమ్మతులు, పునరుద్ధరణల కోసం కేంద్రం ఎటువంటి నిధులను విడుదల చేయలేదు.

లోక్ స‌భకిచ్చిన‌ సమాచారం ప్రకారం, 2014,15, 2022-23 మధ్య 11 రాష్ట్రాలకు రూ.498.3 కోట్ల కేంద్ర సహాయం విడుదల చేశారు. వీటిలో ఒడిశా 810 నీటి వనరుల పునరుద్ధరణ పనులు, తెలంగాణ 437 పనులను పూర్తి చేశాయి.

అయితే, గత ఎనిమిదేళ్లలో ఒడిశాకు కేంద్రం రూ.47.96 కోట్లు మంజూరు చేయగా, తెలంగాణకు రూ.15.47 కోట్లు మాత్రమే మంజూరు చేసింది.

2018-19 నుంచి తెలంగాణకు ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడం వివక్షకు పరాకాష్ట. ఇదే కాలంలో కేంద్రం బీహార్‌కు రూ.17.87 కోట్లు విడుదల చేసింది, అక్కడ కేవలం 59 నీటి వనరులలో మాత్రమే పునరుద్ధరణ పనులు చేపట్టగా, 124 నీటి వనరులలో పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన మధ్యప్రదేశ్‌కు రూ.33 కోట్లు విడుదల చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 6 వరకు, జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్‌లో 20,357, ఆంధ్రప్రదేశ్‌లో 15,189, కర్ణాటకలో 12,185, ఒడిశాలో 9,825, తమిళనాడులో 9,014, ఛత్తీస్‌గఢ్‌లో 7,849 నీటి వనరుల పునరుద్ధరణను పూర్తి చేసింది. తెలంగాణలో కేవలం 3,414 నీటి వనరులను మాత్రమే పునరుద్ధరించారు.

అయితే,లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, బిశ్వేశ్వర్ తుడు మిషన్ కాకతీయ గురించి ప్రశంసించారు. తెలంగాణలో 'మిషన్ కాకతీయ', రాజస్థాన్‌లో 'ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్', మహారాష్ట్రలో 'జల్యూక్త్ శిబార్', గుజరాత్‌లో 'సుజలాం సుఫలాం అభియాన్' ఆంధ్రప్రదేశ్‌లో 'నీరు చెట్టు', బీహార్‌లో 'జల్ జీవన్ హరియాలీ', హర్యానాలో 'జల్ హి జీవన్', తమిళనాడులో 'కుడిమారామత్' వంటి పథకాలతో ఆయా రాష్ట్రాలు నీటి సంరక్షణ/హార్వెస్టింగ్ రంగంలో విశేష కృషి చేశాయని ఆయన పేర్కొన్నారు.

దాదాపు ఈ పథకాలన్నీ చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ నుండి ప్రేరణ పొందాయి.

First Published:  12 Dec 2022 2:35 AM GMT
Next Story