చంద్రబాబుకు షాకిచ్చిన సెంట్రల్ జైలు అధికారులు
చంద్రబాబుపై నమోదైన పలు కేసుల విచారణలు కోర్టులో జరుగుతున్నాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు చంద్రబాబును కలవడానికి న్యాయవాదులకు ఇస్తున్న ములాఖత్‌లను అధికారులు కుదించారు. ఇప్పటి వరకు రోజుకు రెండు సార్లు లాయర్లు చంద్రబాబును కలిసేవారు. అయితే ఇప్పుడు వాటిని ఒకటికి కుదించారు. రోజుకు కేవలం ఒకసారి మాత్రమే చంద్రబాబు లాయర్లు ఆయనను కలిసే వీలు ఉంటుంది.
చంద్రబాబుపై నమోదైన పలు కేసుల విచారణలు కోర్టులో జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్ల కేసులో చంద్రబాబు పేరు ఉన్నది. ఈ కేసులకు సంబంధించిన పిటిషన్లు దాఖలు చేయడానికి న్యాయవాదుల బృందం రోజుకు రెండు సార్లు చంద్రబాబును కలుస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే సూచనలు నమోదు చేసుకోవడం, కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలను లాయర్లతో చర్చిస్తున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ములాఖత్‌ల సంఖ్యను ఒకటికి కుదించినట్లు అధికారులు తెలిపారు.
వీఐపీ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు ఎంతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ములాఖత్‌ల సమయంలో చంద్రబాబుకు సెక్యూరిటీని మరింతగా పెంచుతున్నారు. ఆ సమయంలో సాధారణ ఖైదీలకు ఇబ్బంది ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. పరిపాలన, సెక్యూరిటీ కారణాలతోనే ములాఖత్‌ల సంఖ్యను తగ్గించినట్లు అధికారులు వివరించారు.
కాగా, చంద్రబాబు ములాఖత్‌ల సంఖ్య తగ్గించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబుతో లాయర్లు మాట్లాడకుండా ఉంచేందుకు ఇలా చేశారని ఆరోపిస్తున్నాయి. మరి కొన్ని రోజులు చంద్రబాబును జైలుకే పరిమితం చేసే కుట్రలో భాగంగానే ములాఖత్‌ల సంఖ్య తగ్గించారని టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు. ములాఖత్‌ల సంఖ్య పెంచాలని కూడా కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.