తెలంగాణ గవర్నర్‌గా ఆ మాజీ సీఎం..?
తండ్రి అమర్‌నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి..1989, 99, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్పీకర్‌గానూ వ్యవహరించారు.
తెలంగాణ గవర్నర్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లడంతో కేంద్రం తెలంగాణకు మళ్లీ పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించలేదు. జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయనే గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఐతే ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్‌గా నియమించబోతున్నారంటూ చర్చ జరుగుతోంది. ఇటీవలి ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి...వైసీపీ అభ్యర్థి పి.వి. మిథున్ రెడ్డి చేతిలో దాదాపు 76 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం తెలంగాణ గవర్నర్‌గా నియమించబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కిరణ్‌కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించనున్నారని తెలుస్తోంది.
తండ్రి అమర్‌నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి..1989, 99, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్పీకర్‌గానూ వ్యవహరించారు. YSR మరణం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ రోశయ్యను సీఎంగా చేసింది. తర్వాత తెలంగాణ ఉద్యమం ఎగసిపడడంతో రోశయ్యను తప్పించి.. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా నియమించింది. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి.. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2018లో జై సమైక్యాంధ్ర పార్టీని రద్దు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2023లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఇక ఇటీవలి ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్‌గా నియమించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా పని చేశారని అలాంటి వ్యక్తిని గవర్నర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంలుగా ఉన్నారని..దీంతో కుట్రలకు తెరలేపుతున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.