Telugu Global
Telangana

పొలిటికల్‌ సోదాలు..!?

కేంద్రం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థి పార్టీలపై కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపిస్తున్నారు.

పొలిటికల్‌ సోదాలు..!?
X

తెలంగాణలో మరోసారి ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో జరిపిన సోదాలు రాజకీయరంగు పులుముకుంటున్నాయి. మూడు రోజుల పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ద‌న్ రెడ్డిల నివాసాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 84 గంటల పాటు సోదాలు జ‌రిపారు.

పైళ్ళ శేఖర్‌ రెడ్డికి సంబంధించిన కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఫోకస్‌ పెట్టిన ఐటీ శాఖ ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 70 బృందాలు బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి.

పైళ్ల శేఖర్‌ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్‌, వైష్ణవి వ్యాపార సంస్థల లావాదేవీలను సైతం ఐటీ అధికారులు పరిశీలించారు. తీర్థా గ్రూప్‌న‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ద‌న్ రెడ్డి హైదరాబాద్‌, బెంగళూరులో జరిపిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల గురించి ఆరాతీశారు. బీఆర్‌ఎస్‌ నేతల కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్ల గురించి కూడా ఐటీ అధికారులు ఆరాతీశారు.

బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడంపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థి పార్టీలపై కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపిస్తున్నారు. ఐటీ దాడులతో భయపెట్టాలనుకోవడం బీజేపీ మూర్ఖత్వమే అన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి.

First Published:  17 Jun 2023 11:37 AM IST
Next Story