Telugu Global
Telangana

కేసీఆర్ ను అవమానించేలా కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం!?

రెండు ఎత్తులు చిత్తయ్యాయని ఇప్పుడు పర్యటన రద్దు చేసుకుంటే బాగోదని రామగుండం ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇస్తానంటూ మోడీ వస్తున్నారని టీఆర్‌ఎస్ విమర్శిస్తోంది.

కేసీఆర్ ను అవమానించేలా కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం!?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించేలా కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యవహరించిందన్న విమర్శలు వస్తున్నాయి. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే పేరుతో ఈనెల 12న ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ వస్తున్నారు. అయితే ఈ పర్యటన ఏర్పాటు వెనుక రాజకీయ కారణం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వందల కోట్లు కుమ్మరించిన బీజేపీ పెద్దలు మునుగోడులో విజయం ఖాయమని భావించడంతో పాటు.. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయేందుకు సిద్ధమయ్యారని భావించి.. ప్రధాని పర్యటనను ఏర్పాటు చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గెలిచేస్తారు.. అప్పుడు అతడితో పాటు టీఆర్‌ఎస్ నుంచి వచ్చే నలుగురు ఎమ్మెల్యేలనూ సత్కరించాలన్న ఉద్దేశం కూడా ఈ కార్యక్రమం వెనుక ఉందని చెబుతున్నారు.

కానీ, రెండు ఎత్తులు చిత్తయ్యాయని ఇప్పుడు పర్యటన రద్దు చేసుకుంటే బాగోదని రామగుండం ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇస్తానంటూ మోడీ వస్తున్నారని టీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. అసలు ఏడాదిన్నర క్రితం నుంచే రామగుండం ఫ్యాక్టరీలో 10 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి కూడా జరిగిందని.. ఇప్పుడు వచ్చి జాతికి అంకితం ఇవ్వడం ఏమిటని టీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అవమానించేలా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

ఈనెల 12న జరిగే కార్యక్రమంలో'' మీరూ పాల్గొనండి'' అంటూ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ కేంద్ర ఎరువులశాఖ మంత్రి ఒక లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం వాటా కూడా ఉందని.. అలా చూసినా ప్రధాని తర్వాత కేసీఆర్‌ను ముఖ్యఅతిథి హోదాలో ఆహ్వానించాల్సిందిపోయి.. నామమాత్రంగా మీరూ పాల్గొనండి అని ఆహ్వానించడం ఉద్దేశపూర్వకంగానే చేశారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు విమర్శిస్తున్నాయి.

First Published:  8 Nov 2022 9:58 AM IST
Next Story