Telugu Global
Telangana

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదు : కేంద్రం

కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించమని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదు : కేంద్రం
X

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తమ వివక్షను ప్రదర్శించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వ‌రానికి జాతీయ హోదా కల్పించడానికి నిరాకరించింది. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి ఎలాంటి అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించమని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది.

2016, 2018లో కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలని ప్రధాని మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా కోరారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. తాజాగా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ హోదా విషయమై ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. సదరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒక వేళ అనుమతులు ఉండుంటే.. కాళేశ్వరం ప్రాజెక్టును హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. ఆ కమిటీ అనుమతులు ఇస్తే జాతీయ హోదా వచ్చే అవకాశం ఉందని మంత్రి చెప్పారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల అనుమతులు కూడా తీసుకోలేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఇటీవల వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని నిర్వహణ కంపెనీలే భరిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

First Published:  21 July 2022 5:54 PM IST
Next Story