పన్నుల వాటా విడుదలలోనూ పక్షపాతమే..
మొత్తంగా రెండో విడత రూ.1,16,665.75 కోట్లు విడుదల కాగా, అందులో యూపీకి 20,928 కోట్లు కేటాయించారు. ఏపీకి 4,721 కోట్ల రూపాయలు, తెలంగాణకు 2,452 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో ఆదాయం అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్రాల వాటాను తీరిగ్గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కేటాయింపుల్లో రెండో భాగం బుధవారం విడుదలయ్యాయి. ఇందులో అత్యధిక పన్నుల వాటా నిధులు ఉత్తర ప్రదేశ్ కి వెళ్లగా, అత్యల్ప నిధులు గోవా రాష్ట్రానికి కేటాయించారు. జనాభా, విస్తీర్ణపరంగా, పన్ను ఆదాయ పరంగా చూసుకున్నా తెలంగాణకు అన్యాయమే జరిగిందని అంటున్నారు నిపుణులు.
ఎవరు ఎవరికి చెల్లిస్తున్నారు..?
పన్నుల రూపంలో తెలంగాణే కేంద్రానికి ఎక్కువ ఆదాయం సమకూరుస్తోందని, కేంద్రం నుంచి తెలంగాణకు కేటాయింపులేవీ లేవని ఆ మధ్య కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రం కేంద్రానికి నిధులిస్తుందా, కేంద్రం రాష్ట్రానికి తోడ్పాటునందిస్తుందా అంటూ మండిపడ్డారాయన. ఈ విమర్శలకు తగ్గట్టే.. కేంద్రం కూడా పదే పదే తన కుంచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటోంది. కనీసం వరద సాయంలో కూడా తెలంగాణకు పెద్ద మనసు చేసుకోలేదు. తాజాగా విడుదలైన పన్నుల వాటాలో కూడా బీజేపీ పాలిత యూపీఏ ముందుండటం గమనార్హం. మొత్తంగా రెండో విడత రూ.1,16,665.75 కోట్లు విడుదల కాగా, అందులో యూపీకి 20,928 కోట్లు కేటాయించారు. ఏపీకి 4,721 కోట్ల రూపాయలు, తెలంగాణకు 2,452 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.
ఆ ప్రకటనతో మంటపెట్టారా..?
నిధుల విడుదలలో పక్షపాతం చూపిస్తున్నట్టు స్పష్టంగా తేలినా.. కేంద్రం కప్పి పుచ్చుకునే ధోరణిలో మాట్లాడటం బీజేపీయేతర పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు మరింత ఆగ్రహం తెచ్చిపెడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటా విడుదలే నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక స్థానిక సంస్థలకు నిధులు కేటాయించే విషయంలో కేంద్రం మరోసారి వెనకడుగు వేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా విడుదల చేయలేదు. కేవలం ఏపీ విషయంలోనే గ్రామ పంచాయతీలకు రూ. 678.65 కోట్లు, మండల జిల్లా పరిషత్ లకు రూ. 290.86 కోట్లు, మొత్తం బకాయిలు రూ.969 కోట్లు విడుదల కావాల్సి ఉంది.