Telugu Global
Telangana

తెలంగాణలో ఎక్కువ ఆదాయం.. తెలంగాణకే తక్కువ సహాయం..

ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు తెలంగాణ బడ్జెట్ లో 22 శాతం మాత్రమే. దేశంలో అతి తక్కువ గ్రాంట్ ఇన్ ఎయిడ్ తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి.

తెలంగాణలో ఎక్కువ ఆదాయం.. తెలంగాణకే తక్కువ సహాయం..
X

పన్నుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, హర్యానా, తర్వాత కేంద్రానికి అత్యధిక పన్ను ఆదాయాన్ని సముపార్జించి పెడుతోన్న రాష్ట్రం తెలంగాణే. అలాంటి రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సహాయం చేయాలి. ఏ స్థాయిలో కేటాయింపులుండాలి. కానీ అది జరగకపోగా.. అత్యల్పంగా తెలంగాణకు కేంద్రం విదిలిస్తోంది.

15వ ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 30,497 కోట్ల రూపాయలను రెవెన్యూ లోటు గ్రాంట్‌ గా కేంద్రం నుంచి అందుకుంది. ఏపీ బడ్జెట్ మొత్తంలో ఈ గ్రాంట్ 33 శాతంగా ఉండటం గమనార్హం. ఇక తెలంగాణ విషయానికొస్తే, తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. అంటే కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు గ్రాంటు శూన్యం. అంటే ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి లోటు గ్రాంట్ లభించలేదు, లభించదు కూడా. ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు తెలంగాణ బడ్జెట్ లో 22 శాతం మాత్రమే. దేశంలో అతి తక్కువ గ్రాంట్ ఇన్ ఎయిడ్ తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. డివల్యూషన్స్ విభాగంలో తెలంగాణకు కేవలం 8 శాతం మాత్రమే నిధులు వచ్చాయి. ఇది కూడా కనిష్టమే. అభివృద్ధి ఎక్కువ, జనాభా తక్కువ అనే కారణాలతో డెవల్యూషన్స్ లో 0.34 శాతం కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల అత్యధిక తలసరి ఆదాయం రావడం మినహా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదు.

అయితే తెలంగాణతో పోల్చి చూస్తే ఏపీ ద్రవ్యలోటు తక్కువ అంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. ఏపీ పరిస్థితి మెరుగ్గా ఉంది అని చెప్పే క్రమంలో ఆయన ద్రవ్యలోటుని తెలంగాణతో పోల్చి చెప్పారు. తెలంగాణ ద్రవ్యలోటు 4.13 శాతంగా ఉంటే, ఏపీ ద్రవ్యలోటు కేవలం 3 శాతం మాత్రమేనన్నారు. దీన్ని తెలంగాణ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి ద్రవ్యలోటుని పోలుస్తూ ఈ సహస్రాబ్దిలోనే అతిపెద్ద జోక్ వేశారని అంటున్నారు. ఢిల్లీతో సత్సంబంధాలుండటం వల్లే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇది వారికే అవమానం అంటున్నారు.

First Published:  26 July 2022 7:15 PM IST
Next Story