Telugu Global
Telangana

రూ.60 వేల కోట్ల లోటు తీరేదెలా? కేంద్రం దెబ్బకు తెలంగాణ విలవిల

కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణను అప్పులు కూడా చేసుకోనీయడం లేదని.. మరోవైపు సమయానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, నిధులు కూడా ఇవ్వడం లేదని అధికార టీఆర్ఎస్ విమర్శిస్తోంది.

రూ.60 వేల కోట్ల లోటు తీరేదెలా? కేంద్రం దెబ్బకు తెలంగాణ విలవిల
X

తెలంగాణ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిధుల లేమితో ఇబ్బంది పడుతోంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ తమ అవసరాల కోసం ముందుగానే అప్పులు చేసి.. ఆ తర్వాత రాబడిలో నుంచి కడుతూ వస్తోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ఆర్థిక స్థితి బాగానే ఉండటంతో ఇదే పద్ధ‌తిని అనుసరిస్తున్నారు. మొదట్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు కూడా సక్రమంగానే అందడంతో అంతా సాఫీగా సాగిపోయింది.

కానీ, గత రెండేళ్లుగా సీన్ మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి. అంతేకాకుండా ఇచ్చేవాటిని కూడా ఆలస్యంగా, తక్కువ మొత్తాల్లో ఇస్తుండటంతో రాష్ట్ర ఖజానాపై భారం పడింది. ఈ ఏడాది రాష్ట్రాన్ని నడిపించడానికి అవసరమైన బడ్జెట్‌లో రూ.60 వేల కోట్ల లోటు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం రూ.53 వేల కోట్ల అప్పులు చేయడానికి అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. కానీ కేంద్రం ఇందుకు అడ్డుపుల్ల వేసింది.

తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు రూ.53వేల కోట్ల అప్పుకు అంగీకరించడం లేదని తేల్చి చెప్పింది. అంతే కాకుండా ఈ ఏడాది బయట నుంచి కేవలం రూ.23 వేల కోట్లు మాత్రమే తెచ్చుకోవాలని సూచించింది. అది కూడా రెండు విడతలుగా తెచ్చుకోవాలని.. బాండ్ల రూపంలో రూ.10వేల కోట్లు మాత్రమే తేవాలని తేల్చి చెప్పింది. దీంతో అప్పు రూపేణా తెచ్చుకోవాలనుకున్న డబ్బుల్లో రూ. 30 వేల కోట్లు కోతపడింది.

మరోవైపు తెలంగాణ రాబడి ఈ ఏడాది భారీగా తగ్గింది. అక్కడ దాదాపు రూ.30 వేల కోట్ల వ్యత్యాసం కనపడుతోంది. దీంతో అప్పులు చేయడం ద్వారా, ఆదాయం రూపంలో రావల్సిన డబ్బులో రూ.60 వేల కోట్లు లోటు మిగిలింది. ఇప్పుడు ఈ లోటు ఎలా పూడ్చుకోవాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం సతమతమ‌వుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో రైతు బంధు పథకం ద్వారా నియోజకవర్గంలో 1500 మంది లబ్ధిదారుల చొప్పున ప్రయోజనాలు అందించాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని లబ్ధిదారుల లిస్టును ప్రభుత్వానికి అందించారు. ఈ పథకం కింద ఈ ఏడాది దాదాపు రూ.17 వేల కోట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో తొలి త్రైమాసికం గడిచినా ఇంకా దళిత బంధు ఈ ఏడాదికి అందజేయలేదని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణను అప్పులు కూడా చేసుకోనీయడం లేదని.. మరోవైపు సమయానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, నిధులు కూడా ఇవ్వడం లేదని అధికార టీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇకపై తెలంగాణ బడ్జెట్‌లో సొంత నిధులతో చేపట్టే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కేంద్రం కోసం వేచి చూస్తే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని అధికార పక్షం అంటోంది.

First Published:  19 July 2022 5:30 PM IST
Next Story