Telugu Global
Telangana

చేతులు కాలాక బియ్యం సేకరణ.. బీజేపీ మరో రాజకీయం..

తెలంగాణ రైతాంగానికి, రైస్ మిల్లర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 8 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ కొనేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చేతులు కాలాక బియ్యం సేకరణ.. బీజేపీ మరో రాజకీయం..
X

హఠాత్తుగా కేంద్రానికి తెలంగాణ రాష్ట్రంపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. మునుగోడు బలహీనతా లేక, ఏడాదిలోపు వచ్చేస్తున్న అసెంబ్లీ ఎన్నికలా అనేది తెలియదు కానీ.. తెలంగాణ రైతాంగానికి, రైస్ మిల్లర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 8 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ కొనేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మధ్య దేశంలో వరి ధాన్యం సంక్షోభం రాబోతోంది, వరి విస్తీర్ణం పెంచాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిన తర్వాత, ఇప్పుడు పారాబాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం మొగ్గు చూపడం మరో ముందడుగేనని చెప్పాలి. అయితే దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఉండలేం.

ఈ జ్ఞానోదయం అప్పుడేమైంది..?

కేంద్రం బియ్యం సేకరణకు నిరాకరించడంతో ఈ ఫిబ్రవరిలో ఎంత రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలుసు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని సేకరించడం కుదరదని కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో ఏకంగా సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీలో మకాం వేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ముందు చూపు లేని కేంద్రం ససేమిరా అంది. దీంతో అన్నదాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బియ్యానికి మద్దతు ధర ఇచ్చి సేకరించింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు ఎదురయ్యాయి. గోధుమల ఉత్పత్తి తగ్గిపోవడంతో బియ్యం అవసరం పెరిగింది. బియ్యం సేకరణలో కేంద్రం మొండి పట్టుదల వల్ల ఈ దఫా రైతులు వరివైపు మొగ్గు చూపలేదు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 13.27 శాతం తక్కువగా ఉంది. తెలంగాణ సహా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ ఘఢ్, త్రిపుర, అస్సోం, కర్నాటక, ఏపీ, మేఘాలయ, హర్యానా, మిజోరాం, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ మరియు సిక్కిం వంటి 17 రాష్ట్రాలలో వరి పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై దీని ప్రభావం పడే అవకాశమున్నట్టు స్పష్టమైంది. చేతులు కాలుతాయని తేలడంతో ఇప్పుడు ఆకులు పట్టుకోడానికి సిద్ధమైంది కేంద్రం. దేశవ్యాప్తంగా వరి విస్తీర్ణం పెంచాలంటూ రాష్ట్రాలను బతిమిలాడుకుంటోంది.

కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరి విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో పారాబాయిల్డ్ రైస్ సేకరణకు కూడా తాము ముందున్నామనే సంకేతాలనిస్తోంది. 8 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తామని మిల్లర్లకు తీపి కబురు చెప్పింది. దీంతో తెలంగాణలోని రైస్ మిల్లర్లకు మేలు జరుగుతుందని అంటున్నారు తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి.మోహన్ రెడ్డి. ఇటీవలే టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆయన.. బీజేపీ నూతన విధానాలకు ప్రచారం కల్పించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్రం ఉదారంగా బియ్యం సేకరిస్తామంటోందని చెబుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం వెనుక ఎలాంటి స్వ‌ప్ర‌యోజ‌న కాంక్ష‌ దాగి ఉందో కానీ, మొత్తమ్మీద బియ్యం సేకరణకు సిద్ధపడింది.

First Published:  17 Aug 2022 4:16 PM IST
Next Story