Telugu Global
Telangana

రక్షణ శాఖ భూములు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

గతంలో కేసీఆర్ ప్రభుత్వం సైతం పదేళ్లలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరింది.

రక్షణ శాఖ భూములు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
X

రక్షణ శాఖ భూముల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి భూములను అప్పగించేందుకు అంగీకరించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రక్షణ శాఖ భూములు అప్పగించాలని కోరారు.

తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్‌, సిద్దిపేట రూట్‌తో పాటు నాగ్‌పూర్‌ రూట్‌లో ఎలివేటెడ్ కారిడార్లు రానున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణికులకు మేలు జరగనుంది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే రాజీవ్‌ రహదారి స్టేట్‌ హైవే-1 లో జేబీఎస్‌ నుంచి అవుట‌ర్ రింగు రోడ్డు జంక్షన్ వ‌ర‌కు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూమి అవ‌స‌ర‌మ‌ని, ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు రేవంత్.

ఇక నాగ్‌పూర్ హైవే ఎన్‌హెచ్‌-44 పై కండ్లకోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్యత్తులో డ‌బుల్ డెక్కర్ కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని కోరారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం సైతం పదేళ్లలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరింది. అందుకు బదులుగా మరో చోట భూములు ఇస్తామని తెలిపింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం కేంద్ర ప్రభుత్వానికి అనేక లేఖలు రాశారు. ఈ విజ్ఞప్తికి తాజాగా మోక్షం లభించింది.

First Published:  1 March 2024 9:55 PM IST
Next Story