Telugu Global
Telangana

గద్వాల్‌ ఎమ్మెల్యేగా డీకే అరుణని గుర్తించాలి - ఈసీ

ప్రస్తుతం బీజేపీ నేతగానే కొనసాగుతున్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా గుర్తిస్తే.. ఆమె కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కుతారు.

గద్వాల్‌ ఎమ్మెల్యేగా డీకే అరుణని గుర్తించాలి - ఈసీ
X

గద్వాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సీఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే.. డీకే అరుణను ఎమ్మెల్యేగా నోటిఫై చేస్తూ గెజిట్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. లేఖతో పాటు హైకోర్టు తీర్పు కాపీని జతపరిచింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్‌ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో ఆయనపై అనర్హత వేటు వేసి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్‌ రెడ్డికి మూడు లక్షల జరిమానా కూడా విధించింది. ఇందులో 50 వేల రూపాయలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశించింది.

అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే.. డీకే అరుణ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిపోయారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగానే కొనసాగుతున్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా గుర్తిస్తే.. ఆమె కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కుతారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని డీకే అరుణ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని, స్పీకర్ ను కలిసే ప్రయత్నం చేశారు. కానీ, వారు అందుబాటులోకి రాకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసులో తీర్పు పత్రాలు సమర్పించారు.

*

First Published:  4 Sept 2023 6:21 PM IST
Next Story