Telugu Global
Telangana

యాదాద్రి ఆలయంలోకి సెల్ ఫోన్ లు నిషేధం..

యాదాద్రి ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు సిబ్బందికి, విలేకరులకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు అధికారులు.

యాదాద్రి ఆలయంలోకి సెల్ ఫోన్ లు నిషేధం..
X

ప్రముఖ ఆలయాల్లోకి కెమెరాలు, సెల్ ఫోన్ లు తీసుకెళ్లనివ్వరనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో కూడా ఇలాంటి నిబంధనలే అమలులో ఉన్నాయి. అయితే ఇది కేవలం భక్తులకు మాత్రమే ఉన్న నిబంధన. మీడియా, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర సిబ్బంది ఇప్పటి వరకు ఆలయం లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లేవారు. మూలవిరాట్ మినహా ఆలయంలో జరిగే మిగతా పూజాధికాలను వారు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసేవారు. అయితే ఇప్పుడు దీనిపై కూడా పూర్తిగా నిషేధం విధించారు అధికారులు. యాదాద్రి ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు.




పీటల గొడవే కారణమా..?

ఆమధ్య తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చిన్న పీట వేశారనే వివాదంలో కొంతమంది సిబ్బందిపై వేటు పడింది. ఆ తర్వాత ఆలయంలో అసలు చిన్నపీటలే లేకుండా.. అన్నీ ఒకే సైజులో చేపించారు కూడా. ఇప్పుడు సెల్ ఫోన్ నిషేధం అనే నిబంధన కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఈమేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి అనే పేరుని ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఉత్తర్వులన్నీ అదే పేరుతో జారీ అయ్యేవి. కానీ ఇప్పుడు మళ్లీ యాదగిరిగుట్ట అనే పేరు హైలైట్ అవుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. తాజా ఉత్తర్వులు కూడా లక్ష్మీనరసింహ దేవస్థానం, యాదగిరిగుట్ట అనే పేరుతో జారీ కావడం విశేషం.

First Published:  9 April 2024 12:52 PM IST
Next Story