Telugu Global
Telangana

కాంగ్రెస్‌ రాజకీయ లబ్ధి కోసమే కులగణన

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ సభలో ఇచ్చిన 21 హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఏలేటి ఆగ్రహం

కాంగ్రెస్‌ రాజకీయ లబ్ధి కోసమే కులగణన
X

బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే కులగణన చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదా? అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ సభలో ఇచ్చిన 21 హామీలు నెరవేర్చారా? అని నిలదీశారు. వాటిని నెరవేర్చకుండా కులగణన పేరుతో కాలాయపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్‌ చేసిన కుటుంబ సర్వేను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వం కోర్టుల పేరు మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. మంత్రి పదవుల్లో ఎంత మంది బీసీలున్నారు? ప్రభుత్వానికి రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కులగణనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర సర్వే పేరుతో గతంలో కేసీఆర్‌ మోసం చేస్తే, కులగణన పేరుతో రేవంత్‌ సర్కార్‌ మోసం చేయడానికి యత్నిస్తున్నది. కులగణన గురించి మాట్లాడటానికి రాహుల్‌ గాంధీని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ రప్పించారు. ఆయనకు కుల గణన గురించి మాట్లాడే హక్కు ఉన్నదా? కులగణన గురించి మాట్లాడే రాహుల్‌కు ఈ దేశ సంస్కృతి , సంప్రదాయాల గురించి ఎంత వరకు అవగాహన ఉన్నదో ముందు ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే మీ తాత పేరు ఏమిటి అంటే రాజేశ్వర్‌రెడ్డి, మా తండ్రి పేరు పద్మనాభరెడ్డి అని అని చెబుతాను. కానీ నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ గాంఢీ. అందుకే రాహుల్‌ ఏ కులమో, ఏ మతమో మాకు తెలియాలన్నారు. కులగణనపై ఓపెన్‌ డిబేట్‌కు సీఎం సిద్ధమా? అందులో పాల్గొనడానికి ఎక్కడికి రమ్మంటారో ఆయన చెప్పాలని ఏలేటి సవాల్‌ విసిరారు.

First Published:  6 Nov 2024 10:36 AM GMT
Next Story