తెలంగాణలోనూ కులగణన.. బీసీ జనాభాను లెక్కించేందుకే!
కులగణను ప్రధానంగా బీసీ జనాభా లెక్కగట్టడం కోసమే చేపట్టబోతున్నారు. బీసీ జనగణనను చేపడతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది.
తెలంగాణలో త్వరలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కులగణన జరుగుతోంది. దాదాపు 80 శాతం వరకు కులగణన పూర్తయింది. ఇప్పుడు తెలంగాణలోనూ కులగణనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
బీసీల జనాభాను లెక్కగట్టడానికే గణన
కులగణను ప్రధానంగా బీసీ జనాభా లెక్కగట్టడం కోసమే చేపట్టబోతున్నారు. బీసీ జనగణనను చేపడతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో జనగణనపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. బీసీలకు సంక్షేమ పథకాల అమలు కోసం వారి జనాభా ఎంత ఉందో లెక్కించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఏపీలో వాలంటీర్లతో.. మరి తెలంగాణలో?
ఏపీలో వాలంటీర్లు ఉండటంతో కులగణన శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 80 శాతం వరకు పూర్తయినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణలో వాలంటీర్ల వంటి వ్యవస్థ లేదు. అంగన్‌వాడీలు, పంచాయతీలు, పురపాలక సిబ్బంది వంటి వారిని దీనికి వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే వీరి సంఖ్య వాలంటీర్లంత ఎక్కువగా ఉండదు కాబట్టి ప్రక్రియ అంత వేగంగా జరగదు.