కుటుంబ సర్వే.. తన ఫ్యామిలీ డీటైల్స్ చెప్పిన కలెక్టర్
కలెక్టర్ కుటుంబ వివరాలు నమోదు చేసిన ఎన్యూమరేటర్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో భాగంగా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తన కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించారు. గురువారం ఎన్యూమరేటర్ ఆయేషా హమీరా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనతో పాటు తన కుటుంబ సభ్యుల వివరాలన్ని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిని సర్వే చేసి ఆయా కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటు వారి కులం వివరాలను సేకరిస్తోంది. ఈ సర్వేను బుధవారమే ప్రారంభించగా ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఇండ్లకు వెళ్లి వారి ఏ రోజు వారికి ఇంటికి సర్వేకు వస్తారు.. సర్వే సందర్భంగా ఏయే పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలనే సమాచారం తెలియజేస్తున్నారు. సర్వేకు ఏ రోజు వస్తారో ఆ వివరాలను ఇంటి గోడకు అంటించే స్లిప్ పై నమోదు చేస్తున్నారు. ఆ రోజు కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉండి పూర్తి పత్రాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలన్నీ తెలియజేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈక్రమంలోనే నల్గొండ కలెక్టర్ ఇంటికి వెళ్లిన ఎన్యూమరేటర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినట్టుగా క్యాంప్ ఆఫీస్ గోడపై స్లిప్ అంటించారు.