తూప్రాన్ చెక్ పోస్ట్ వద్ద కోటి రూపాయలు సీజ్.. మునుగోడుకి ఆగని ధన ప్రవాహం
ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.6.80 కోట్ల నగదు పట్టుబడింది. తాజాగా దొరికిన సొమ్ముతో అది 7.74 కోట్లకు చేరుకుంది. ఒక ఉప ఎన్నిక సమయంలో ఈ స్థాయిలో నగదు పట్టుబడటం విశేషం.
మునుగోడులో ఉప ఎన్నికల పోలింగ్ కి మరికొద్ది గంటలే సమయం మిగిలి ఉంది. ఈ దశలో మునుగోడు పరిధిలో నోట్ల కట్టలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా చౌటుప్పల్‌మండలం తూప్రాన్ చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ.93.99లక్షల సొత్తుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన లెక్కలు చూపకపోవడంతో ఆ నగదుని సీజ్ చేశారు. ఉప ఎన్నికల పోలింగ్ కి టైమ్ దగ్గరపడటంతో నగదు పంపిణీకి ఈ సొమ్ము తీసుకెళ్తున్నట్టు అనుమానిస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. అయినా కూడా వారి కళ్లుగప్పి నగదు రవాణా చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.6.80 కోట్ల నగదు పట్టుబడింది. తాజాగా దొరికిన సొమ్ముతో అది 7.74 కోట్లకు చేరుకుంది. ఒక ఉప ఎన్నిక సమయంలో ఈ స్థాయిలో నగదు పట్టుబడటం విశేషం.
చకచకా ఏర్పాట్లు..
ఇక పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. చండూరులోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో ఈ ఉదయం నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలనుంచే ఎన్నికల సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తీసుకెళ్తున్నారు.
ఇక గురువారం ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ మొదలవుతుంది. ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని నిర్థారించుకున్న తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ అధికారికంగా మొదలవుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు.