అరవింద్ ఇంటిపై దాడి ఘటన..50 మందిపై కేసులు
అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డ 50 మందిపై పోలీసులు 148, 149, 452 సెక్షన్ల కింద, అలాగే ఐపీసీ పీనల్ కోడ్ సెక్షన్ 323, 427, 354 కింద కేసులు నమోదు చేశారు.
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఘటనకు సంబంధించి 50 మందిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖర్గేతో టచ్‌లో ఉన్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లో ఉన్న ఎంపీ అరవింద్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఇంటి అద్దాలు పగలగొట్టడమే కాకుండా లోపలికి ప్రవేశించి ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎంపీ అరవింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డ 50 మందిపై పోలీసులు 148, 149, 452 సెక్షన్ల కింద, అలాగే ఐపీసీ పీనల్ కోడ్ సెక్షన్ 323, 427, 354 కింద కేసులు నమోదు చేశారు. అరవింద్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 8 మంది నిందితులను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, టీఆర్ఎస్ శ్రేణులు కూడా అందుకు దీటుగా స్పందించడంతో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.