బండ్ల గణేష్‌పై మరో కేసు.. ఇల్లు కబ్జా చేస్తున్నారని యజమాని ఫిర్యాదు
కొంతకాలంగా అద్దె ఇవ్వడం లేదని నౌహీరా చెబుతున్నారు. అడిగితే గూండాలను పెట్టి బెదిరిస్తున్నారని, తన ఇంటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని వాపోయారు.
సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్‌పై మరో కేసు నమోదైంది. చెక్ బౌన్స్ కేసులతో తరచూ వార్తల్లోకి ఎక్కే గణేష్, ఈసారి భూకబ్జా ఆరోపణలకు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లో తన ఇంటిని బండ్ల గణేష్‌కు అద్దెకు ఇచ్చానని, ఆయన దాన్ని రాజకీయ పలుకుబడితో కబ్జా చేయబోతున్నాడని యజమాని నౌహీరా షేక్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
హీరా గ్రూప్ ఛైర్మన్ ఇల్లు అద్దెకు తీసుకున్న బండ్ల
ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు నౌహీరా షేక్. ఆమె ఫిలింనగర్‌లోని తన ఇంటిని నెలకు రూ. లక్ష అద్దెకు బండ్ల గణేష్‌కు ఇచ్చానని, ఆయన కొంతకాలంగా అద్దె ఇవ్వడం లేదని నౌహీరా చెబుతున్నారు. అడిగితే గూండాలను పెట్టి బెదిరిస్తున్నారని, తన ఇంటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని వాపోయారు. 75 కోట్ల విలువైన ఆ ఇంటిని రాజకీయ పలుకుబడితో కబ్జా చేసేయడానికి బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు.
చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు
2019లో తన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ కోసం ప్రకాశం జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి 95 లక్షల రూపాయలు బండ్ల గణేష్ అప్పు తీసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమంటే చెక్ ఇచ్చారు. ఆ ఖాతాలో డబ్బుల్లేక చెక్ బౌన్స్ అయింది. గణేష్‌కు చెప్పినా పట్టించుకోలేదని వెంకటేశ్వర్లు కోర్టుకెళ్లారు. ఒంగోలు కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే ఆయన దానిపై పైకోర్టులో అప్పీలు చేశారు.